Postal ballot voting: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కొనుగోలు కలకలం.. వీడియో వైరల్..

రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికార పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది.

Update: 2024-05-06 08:42 GMT

దిశ వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికార పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సంఘం ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా వైసీపీ నేతలు మాత్రం వాళ్ళ పంథా మార్చుకోవడం లేదు. ఎన్నికల కోడ్ నిబంధనలను తుంగలో తొక్కి ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కొనుగోలుకు వైసీపీ నేతలు సిద్ధపడడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా అనంతపురంలోని కళ్యాణదుర్గంలో ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఓ కానిస్టేబుల్ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని పోస్టల్ బ్యాలెట్ వేసే ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేస్తూ టీడీపీ నేతలకు పట్టుబడ్డాడు.

అలానే వైసీపీ నేతలు కూడ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఉద్యోగులు వైసీపీకి ఓటు వేయాల్సిందిగా సూచిస్తూ.. ఆన్లైన్ ద్వారా నగదు పంపిస్తామని ప్రలోభాలకు గురి చేస్తూ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నారు. కాగా వైసీపీ నేతల తీరుపై అసహనానికి గెరైన టీడీపీ నాయకులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైసీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్న వైసీపీ నేతలపై అధికారులు చర్యలు తీసుకోని నేపథ్యంలో ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఓటు వేయడానికి వచ్చిన ఉద్యోగుల కోసం పోలింగ్ కేంద్రం దగ్గర సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. అలానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు టీడీపీకి పడకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. 

Similar News