AP Politics: దగ్గుపాటి ప్రసాద్ ను గెలిపించండి.. మందకృష్ణ మాదిగ పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు.

Update: 2024-05-06 15:39 GMT

దిశ ప్రతినిధి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. అనంతపురం నగరంలోని ఒ‍క ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మందకృష్ణతో పాటు అసెంబ్లీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ, పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈసందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. మాదిగలతో పాటు అన్ని వర్గాల వారు వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయారన్నారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ మార్చేశాడన్నారు. ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

అనంతపురం అర్బన్‌లో దగ్గుపాటిని, ఎంపీ అభ్యర్థి అంబికాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో అత్యంత ఎక్కువగా నష్టపోయింది దళితులేనన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో వారిపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కూడా దారి మళ్లించారన్నారు.

మాదిగలు జగన్‌కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వారికోసమే ఖర్చు చేస్తామన్నారు. 50 ఏళ్లకే పింఛన్లు కూడా ఇస్తామన్నారు. ఆ తరువాత ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. జగన్‌ను నమ్మి ఓటు వేసినందుకు దళితులపై దాడులకు తెగబడ్డారని అన్నారు.

దళిత ద్రోహిగా మారిన జగన్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు విశ్వనాథ్, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీనరసింహ, ఎమ్మార్పీఎస్ నేతలు మధు, కదిరప్ప, నాగార్జున, మాజీ కార్పొరేటర్ సరుపూటి రమణ, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు వెంకటేష్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శివకుమార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Similar News