రూ.2 వేల కోట్ల విలువైన భూములను ఐదారు లక్షలకే ఇచ్చేలా ఒప్పందాలు..

నేడు జనసేన నేత పీతల మూర్తి యాదవ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జవహార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-25 10:28 GMT

దిశ వెబ్ డెస్క్: నేడు జనసేన నేత పీతల మూర్తియాదవ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జవహార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రాలో రూ.2 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములను సీఎస్ జవహార్ రెడ్డి కొట్టేశారని ఆరోపించారు. అలానే జవహార్ రెడ్డి సీఎస్ అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఇచ్చారని వక్కానించారు.

కాగా జీవో 596 ఆధారంగానే 800 ఎకరాలకుపైగా భూములకు డీల్ జరిగిందని ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ఉన్న వందల ఎకరాలపై జవహార్ రెడ్డి కన్నుపడిందని, ఈ నేపథ్యంలో కుమారుడిని రంగంలోకి దింపారని మండిపడ్డారు. అందరూ ఎన్నికల హింసపై విచారిస్తుంటే సీఎస్ మాత్రం విశాఖలో భూవ్యవహారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో జవహార్ రెడ్డి భారీగా భూఅక్రమాలకు తెరలేపారని దుయ్యబట్టారు.

400 ఎకరాల ఎస్సీ, బీసీల అసైన్డ్ భూములను బినామీల పేరిటట జవహార్ రెడ్డి చేజిక్కించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 వేల కోట్ల విలువైన భూములను ఐదారు లక్షలకే ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. అయితే వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు అనే భయంతోనే హడావిడిగా రిజిస్ట్రేషన్లకు సిద్ధం చేసుకున్నారని ద్వజమెత్తారు. ఈసీ జోక్యం చేసుకుని అక్రమ భూరిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని.. అలానే రాష్ట్రవ్యాప్తంగా మార్చి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లు రద్ధు చేయాలని డిమాండ్ చేశారు.

Similar News