ఆగ్రహించిన మహిళా లోకం.. తరలిస్తారా.. ధ్వంసం చేయమంటారా..?

దిశ, దామరచర్ల : నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని న్యూ రామాలయం కాలనీ పరిధి వీర్లపాలెం రోడ్డులో గల మద్యం దుకాణాన్ని తొలగించాలని, పక్కనే ఉన్న పర్మిట్ రూమ్‌ను వేరొక ప్రాంతానికి తరలించాలని కోరుతూ న్యూ రామాలయం కాలనీ వాసులు మంగళవారం ధర్నాకు దిగారు. ఇక్కడ మద్యం షాపులకు అనుమతులు ఇవ్వడం వలన కాలనీ ప్రజలు గత నాలుగేండ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని మండిపడ్డారు. మందు బాబులు వైన్ షాప్‌లో మద్యం తాగి సీసాలు […]

Update: 2021-11-30 05:53 GMT

దిశ, దామరచర్ల : నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని న్యూ రామాలయం కాలనీ పరిధి వీర్లపాలెం రోడ్డులో గల మద్యం దుకాణాన్ని తొలగించాలని, పక్కనే ఉన్న పర్మిట్ రూమ్‌ను వేరొక ప్రాంతానికి తరలించాలని కోరుతూ న్యూ రామాలయం కాలనీ వాసులు మంగళవారం ధర్నాకు దిగారు. ఇక్కడ మద్యం షాపులకు అనుమతులు ఇవ్వడం వలన కాలనీ ప్రజలు గత నాలుగేండ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని మండిపడ్డారు.

మందు బాబులు వైన్ షాప్‌లో మద్యం తాగి సీసాలు పగలగొట్టి విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని, తరచూ ఇక్కడ గొడవలకు దిగుతున్నారని తెలిపారు. అంతేకాకుండా కొందరు ఆకతాయిలు, దొంగలు ఇక్కడ కాపుకాచి ఆరు బయటికు వెళ్ళిన మహిళలపై దాడులకు తెగబడుతూ, మెడలోని పుస్తెల తాడును సైతం దొంగిలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సత్వరమే ఇక్కడ ఏర్పాటు చేసిన వైన్ షాప్‌ను వేరొక ప్రాంతానికి తరలించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఇక్కడ వైన్‌షాప్ ఏర్పాటు చేసేటప్పుడే తాము చెప్పామని అయినా వినిపించుకోలేదన్నారు. పలుమార్లు గ్రామ సర్పంచ్ బంటు కిరణ్, దామరచర్ల తహశీల్దార్, ఎంపీడీఓ, మిర్యాలగూడ ఆర్డీఓ, మిర్యాలగూడ ఆబ్కారీ డిపార్ట్మెంట్, వాడపల్లి పోలీస్, నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు కూడా చేశామన్నారు.

కొందరు మందుబాబులు పీకల దాకా తాగి తమ ఇళ్లల్లోకి వస్తున్నారని, ఇదే విషయమై వాడపల్లి ఎస్ఐకు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వైన్ షాపు, పర్మిట్ రూమ్‌ను వేరొక ప్రాంతానికి, జనావాసాలకు దూరంగా తరలించాలని న్యూ రామాలయం కాలనీ వాసులు కోరుతున్నారు. ఒకవేళ మద్యం దుకాణం ఇక్కడే ఉంచాలని అధికారులు భావిస్తే కాలనీ వాసులతో వైన్‌షాప్‌ను ముట్టడించి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. వైన్‌షాపు ఇక్కడి నుంచి తొలగించే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

Tags:    

Similar News