బెయిల్ పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు.. కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఆదేశం

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Update: 2024-05-07 08:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే.. సీఎంగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది.

ఇదే కేసులో ఈడీ అరెస్టును చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, దాని విచారణ టైం పట్టే ఛాన్స్ ఉంది. దీంతో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. ఇది ఓ అసాధరాణ పరిస్థితి అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ఎన్నుకున్న సీఎం కేజ్రీవాల్ అని తెలిపింది. ఆయన గతంలో ఎలాంటి నేరాలు చేయలేదు అని వ్యాఖ్యానించింది. లోక్ సభ ఎన్నికలు ఐదేళ్లకొకసారి వస్తాయని.. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

అయితే, సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అయితే మాత్రం ఈ కేసును ప్రత్యేకంగా చూడొద్దని విన్నవించింది. రాజకీయనాయకులకు కేసుల్లో మిహాయింపు ఉండొద్దని తెలిపింది. ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది. 9 సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ పట్టించుకోలేదని.. కేసులో దర్యాప్తునకు సహకరించలేదని వివరించింది. అందుకే అరెస్టు తప్పలేదని కోర్టుకు తెలిపింది ఈడీ.

కేజ్రీవాల్ తరఫున వాదనలు విన్న సుప్రీం బెంచ్.. ఒకవేళ ఈ కేసులో మీకు బెయిల్‌ మంజూరు చేస్తే అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని పేర్కొంది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఆదేశించింది. అయితే, ఈకేసులో తీర్పు మధ్యాహ్నం వరకు వెలువడే ఛాన్స్ ఉంది.

Similar News