గాంధీల కంచుకోటలో అనూహ్య అభ్యర్థి.. కిషోరిలాల్ శర్మ ఫ్లాష్‌బ్యాక్ తెలుసా ?

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ లేదా రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని చాాలామంది భావించారు.

Update: 2024-05-03 12:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ లేదా రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని చాాలామంది భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అక్కడి నుంచి కిషోరి లాల్ శర్మకు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. ఇంతకీ ఆయన ఎవరు ? రాజకీయ నేపథ్యం ఏమిటి ? అమేథీతో అనుబంధం ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..

విధేయతకు బహుమతి

కిషోరి లాల్ శర్మ అమేథీలో సీనియర్ కాంగ్రెస్ నేత. ఈయన గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా అమేథీ నుంచి పోటీ చేస్తే ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించేది కిషోరి లాల్ శర్మే. పార్టీపై చూపిస్తున్న విధేయతకు బహుమతిగా ఈసారి అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఆయనకే కాంగ్రెస్ పార్టీ కల్పించింది. టికెట్ దక్కిన వెంటనే ఆయన శుక్రవారం నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి వచ్చిన ప్రియాంకాగాంధీ గౌరీగంజ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శర్మతో సమావేశమై, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అమేథీ స్థానంలో మే 20న పోలింగ్ జరగనుంది.

రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా..

కిషోరి లాల్ శర్మ వాస్తవానికి పంజాబ్‌లోని లూథియానా ప్రాంతానికి చెందిన వ్యక్తి. సంజయ్ గాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ అమేథీ ఉప ఎన్నికలో విజయం సాధించడంలో కిషోరి లాల్ శర్మ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో రాజీవ్ గాంధీతో కలిసి రాయ్‌బరేలీ, అమేథీలలో ఆయన సుడిగాలి ప్రచారం చేశారు. దానికి తగ్గ ఫలితం కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 1991 మేలో రాజీవ్ గాంధీ మరణం తర్వాత గాంధీ కుటుంబానికి కిషోరి లాల్ శర్మ మరింత చేరువయ్యారు. గాంధీల గైర్హాజరీలో అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలను ఈయనే పర్యవేక్షించేవారు. 1998 సంవత్సరం తర్వాత అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న తొలి గాంధీయేతర కాంగ్రెస్ అభ్యర్థిగా శర్మ నిలిచారు. 1998లో అమేథీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి‌గా సతీష్ శర్మ పోటీ చేయగా.. ఆయనపై బీజేపీ అభ్యర్థి సంజయ సింహ్ విజయం సాధించారు. 2019లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీచేసి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. 1999 తర్వాత అమేథీలో గాంధీ కుటుంబ నాయకుడిని ఓడించిన తొలి బీజేపీ నేతగా ఇరానీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.

Tags:    

Similar News