బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అభ్యర్థులకు సహాయం కోసం బీజేపీ హెల్ప్‌‌డెస్క్

పశ్చిమ్ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే

Update: 2024-05-09 11:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ్ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్కామ్‌ కారణంగా నష్టపోయిన నిజమైన అభ్యర్థులకు సహాయం చేయడానికి బీజేపీ కొత్తగా ప్రత్యేక న్యాయ పోర్టల్, హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు పార్టీ సీనియర్ నాయకుడు గురువారం తెలిపారు. ఇంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ, ఈ స్కామ్‌లో నష్టపోయిన వాస్తవ అభ్యర్థులకు సహాయం చేయడానికి లీగల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని బెంగాల్ రాష్ట్ర బీజేపీని కోరారు. దీంతో బుధవారం రాత్రి హెల్ప్‌లైన్ నంబర్, పోర్టల్‌ను పబ్లిక్‌గా అందుబాటులో ఉంచారు.

హెల్ప్‌లైన్ ప్రారంభించడంపై బీజేపీ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు దీనిని తెచ్చాం. టీఎంసీ కొందరిని అక్రమంగా రిక్రూట్‌మెంట్ చేయడం వల్ల నష్టపోయిన వాస్తవ అర్హులైన అభ్యర్థుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత పశ్చిమ బెంగాల్ బీజేపీకి ఉందని అన్నారు. లీగల్ సపోర్ట్ వెబ్‌సైట్ ' bjplegalsupport.org ' , హెల్ప్‌లైన్ నంబర్ 9150056618. హెల్ప్‌లైన్ నంబర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు వచ్చిన తర్వాత, సంబంధిత అభ్యర్థితో మాట్లాడి, వారి కేసు స్థితిని తెలుసుకుని, ఆ తర్వాత మేము తదనుగుణంగా న్యాయ సహాయం అందిస్తామని ఆయన చెప్పారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్-2016 ద్వారా టీచర్ రిక్రూట్‌మెంట్ నిర్వహించగా, కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 22న ఈ నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో దాదాపు 26,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News