ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఓటు వేశాం: అరవింద్ కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఆరోదశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం నుంచి ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది

Update: 2024-05-25 07:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఆరోదశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం నుంచి ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లు వాతావరణ శాఖ సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్ వెలుపల తన కుటుంబసభ్యులతో కలిసి సిరా వేసిన వేలితో ఫొటో దిగారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన, నా తండ్రి, భార్య, నా పిల్లలిద్దరూ ఓటు వేశారు. మా అమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుందని అందుకనే ఈ రోజు ఆమె రాలేకపోయారని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా నా ఓటు హక్కును వినియోగించుకున్నానని కేజ్రీవాల్ తెలిపారు. అలాగే, ఓటర్లకు కూడా పలు సూచనలు చేశారు. ఈ రోజు వేడి గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. అయినప్పటికీ ప్రజలు ఇంట్లో కూర్చోవద్దు, పలు జాగ్రత్తలు పాటిస్తూ ఓటు వేయాలని ఓటర్లందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ పొత్తులో భాగంగా కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారని, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆప్ అభ్యర్థికి ఓటు వేస్తారని అన్నారు.

Similar News