ఎన్నికల్లో ఊహించని పరిణామం.. బీజేపీ అభ్యర్ధిని పరుగులు పెట్టించిన ఓటర్లు!

లోక్ సభ ఎన్నికల వేల పోటీ చేసే అభ్యర్ధులకు ఊహించని పరిణామాలు ఎదురౌతున్నాయి.

Update: 2024-05-25 14:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేల పోటీ చేసే అభ్యర్ధులకు ఊహించని పరిణామాలు ఎదురౌతున్నాయి. ఈ నేపధ్యంలోనే పశ్చిమ బెంగాల్ లో బూత్ ను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ అభ్యర్ధిని ఓటర్లు పరుగులు పెట్టించారు. పోలింగ్ కేంద్రానికి రావొద్దు అంటూ రాళ్లు కర్రలతో వెంటపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బెంగాల్ లో ఆరో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఝర్‌గ్రాం పార్లమెంట్ నియోజకవర్గంలోని మొంగ్లాపోటా గ్రామంలోని ఓ పోలింగ్ బూత్ లో ఓటర్లను పోలింగ్ బూత్ లోకి అనుమంతించకుండా కొందరు దుండగులు అడ్డుపడుతున్నారని తెలిసింది. విషయం తెలుసుకున్న బీజేపీ అభ్యర్ధి ప్రణత్ టుడు ఆయన అనుచరులతో బూత్ వద్దకు వెళ్లాడు. బూత్ వద్దే ఉన్న దుండగుల ముఠా ఆయనపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు.

అంతేగాక రాళ్లు విసురుతూ.. కర్రలతో ఆయనను వెంబడిస్తూ పరుగులు పెట్టించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను రక్షించారు. ఈ ఘటనలో అభ్యర్ధితో పాటు పలువురు భాజాపా నేతలకు గాయాలయ్యాయి. దీనిపై ప్రణత్ స్పందిస్తూ.. మొంగ్లాపోటాలో 200 మంది దుండగులు తనపై దాడి చేశారని, స్థానిక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని, కేంద్ర బలగాలు లేకపోతే తన ప్రాణం పోయేదని వాపోయారు. ఇందుకే దీదీ సీఏఏ ను అమలు చేయనివ్వట్లేదని బెంగాల్ ను పాకిస్తాన్ లా మార్చాలని అనుకుంటుందని ఆరోపించారు. దీనికి తృణమూల్ నేతలు స్పందిస్తూ.. ప్రణత్ బాడీ గార్డ్ బూత్ వెలుపల ఓటు వేయడానికి క్యూలో ఉన్న మహిళపై దాడి చేయడంతో గ్రామస్తులు తిరగబడ్డారని ఆరోపణలు చేస్తున్నారు.


Similar News