దురదృష్టకరం.. సామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్

దేశ భిన్నత్వంపై సామ్ పిట్రోడా చేసిన కామెంట్లపై కాంగ్రెస్ స్పందించింది. సామ్ పిట్రోడా అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని పేర్కొంది

Update: 2024-05-08 12:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ భిన్నత్వంపై సామ్ పిట్రోడా చేసిన కామెంట్లపై కాంగ్రెస్ స్పిందించింది. దేశంలోని భిన్నత్వం గురించి సామ్ పిట్రోడా అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదించదగినవి కావన్నారు. సామ్ పిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు జైరాం రమేశ్.

‘భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. తూర్పు దిక్కు ఉన్న ప్రజలు చైనా వ్యక్తులను పోలి ఉంటారు. పశ్చిమాన ఉన్న ప్రజలు అరబ్‌ వారిలా ఉంటారు. ఉత్తరాది ప్రజలు నల్లగా లేదా తెల్లగా ఉంటారు. దక్షిణాది వారు ఆఫ్రికన్లలా కనిపిస్తారు.’ అని సామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో భారత్‌లో భిన్నత్వం గురించి అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు జాత్యహంకారంతో కూడినవి బీజేపీ నేతలు మండిపడ్డారు.

ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ వరంగల్ ఎన్నికల ప్రచారంలో స్పందించారు. సామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ జవాబు ఇవ్వాలని అన్నారు. శరీర వర్ణం పేరుతో దేశ ప్రజలను ఎవరైనా అగౌరవ పరిస్తే.. ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని మండిపడ్డారు. అసోం, మణిపూర్ ముఖ్యమంత్రులు సైతం.. సామ్ పిట్రోడాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు సామ్ పిట్రోడా. అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను ఆసక్తికర చట్టం అని మాట్లాడి రాజకీయంగా దుమారం రేకెత్తించారు. రామమందిరంపై మాట్లాడుతూ.. అయోధ్య ఆలయాన్ని ప్రారంభించాలని చూసే వారికి.. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్య, ఆరోగ్యం వంటి సమస్యలు ఎందుకు పట్టవు అని ప్రశ్నించారు. 1984 సిక్కు అల్లర్ల గురించి సామ్ పిట్రోడాను అడిగినప్పుడు.. జరిగిందేదో జరిగిపోయింది అని కొట్టిపారేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు కూడా వివాదాన్ని రేపాయి.

Similar News