బయటపడ్డ ట్రంప్ ప్రైవేట్ లైఫ్.. సాక్ష్యం చెప్పిన శృంగార తార
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో సన్నిహితంగా గడిపానని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ పేర్కొన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో సన్నిహితంగా గడిపానని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల టైంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండేందుకు ట్రంప్ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఈ హుష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టుకు ఆమె వాంగ్మూలం ఇచ్చారు.
2011లో ఈ విషయం బయటకు వచ్చిందని వాంగ్మూలంలో తెలిపారు. 2016 ఎన్నికల సమయంలో 1,30,000 డాలర్ల నగదుని ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ నుంచి అందుకున్నట్లు స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. అయితే, ట్రంప్ నుంచి డబ్బులు వసూలు చేయడం తన ఉద్దేశం కాదని ఆమె స్పష్టం చేశారు. స్టార్మీ డేనియర్ ఆరోపణలను ట్రంప్ తరఫున న్యాయవాదులు ఖండించారు. కేవలం డబ్బుల కోసమే ట్రంప్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
2006లో లేక్ తాహో సెలబ్రెటీ గోల్ఫ్ ఔటింగ్ లో ట్రంప్‌ను తొలిసారి కలిశా అని స్టార్మీ డేనియల్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆమెను హోటల్ లో డిన్నర్ కు ఆహ్వానించారని అన్నారు. ఆ తర్వాత హోటల్ సూట్‌కు తీసుకెళ్లారు. ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైందని తెలిపారు. అక్కడ ఇద్దరూ సన్నిహితంగా గడిపామని తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు భేటీ అయినప్పటికీ సన్నిహితంగా మెలగలేదని.. తమ సంబంధం గురించి ఎంతోమందికి తెలుసు అని డేనియల్ వివరించారు.
హుష్ మనీకి సంబంధించిన కేసుపై న్యూయార్క్ న్యాయస్థానం కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతోంది. ట్రంప్‌పై ఆరోపణలు చేసిన శృంగార తార స్టార్మీ డేనియల్.. సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వచ్చారు. డేనియల్ స్టేట్ మెంట్ ఇచ్చే టైంలో ట్రంప్ కోర్టులోనే ఉన్నారు. వాదనల సమయంలో తన న్యాయవాదులతో గుసగుసలు ఆడుతున్నట్లు కనిపించిన ఆయన.. ఆమె సాక్ష్యం చెబుతున్న సమయంలో తన తలను ఊపుతున్నట్లు కనిపించారు. అది సాక్షులను బెదిరించడమే అవుతుందని ట్రంప్ న్యాయవాదులకు జ్యూరీ సభ్యులు సూచించారు.