ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్.. మరోసారి లుక్‌అవుట్ నోటీసులు

లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో సంచలనం రేపిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు.

Update: 2024-05-04 09:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో సంచలనం రేపిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. శనివారం సిట్ బృందం ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి చేరుకుని అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణకు రాష్ట్ర హోంమంత్రి గంగాధరయ్య పరమేశ్వర రెండోసారి లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ కూడా దేశం విడిచిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు.

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పలువురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయనకు చెందిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయగా, విచారణకు హాజరుకావాల్సిందిగా ప్రజ్వల్ రేవణ్ణకు నోటీసులు ఇవ్వగా ఆయన రాకపోవడంతో లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో జర్మనీలో ఉన్నటువంటి ప్రజ్వల్ ఇండియాలోకి అడుగుపెట్టగానే అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. అయితే దీనిపై ఎక్స్‌లో స్పందించిన ఆయన దర్యాప్తు బృందం ముందు హాజరు కావడానికి సమయం కోరారు. దీనిని తిరస్కరించిన సిట్ బృందం మరోసారి ప్రజ్వల్ రేవణ్ణకు లుక్‌అవుట్ నోటీసులు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. బాధితులకు అన్ని విధాలా ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు, ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం, ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరిగేలా చూస్తామని తెలిపారు.

Similar News