బెయిల్ కోసం వింత నిర్వాకం!.. తన లాంటి వ్యక్తినే వైద్య పరీక్షలకు పంపిన మొబైల్ కంపెనీ చైర్మన్

బెయిల్ కోసం ప్రముఖ మొబైల్ కంపెనీ సంస్థల చైర్మన్ చేసిన నిర్వాకం ఈడీ అధికారులను సైతం ఆశ్యర్యానికి గురి చేసింది.

Update: 2024-05-18 12:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బెయిల్ కోసం ప్రముఖ మొబైల్ కంపెనీ సంస్థల చైర్మన్ చేసిన నిర్వాకం ఈడీ అధికారులను సైతం ఆశ్యర్యానికి గురి చేసింది. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ పై ఉన్న లావా కంపెనీ చైర్మన్ హరిఓం రాయ్.. ఆనారోగ్య కారణాల దృష్యా బెయిల్ పొడగించాలని పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు అతనికి వైద్య పరీక్షలు చేయించి నివేదిక సమర్పించాలని ఈడీ అధికారులకి ఆదేశాలిచ్చింది. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల 16వ తేదీన ఎయిమ్స్ కు రావాలని హరిఓం రాయ్ కు ఈడీ అధికారులు సూచించారు. ఈ మేరకు గురువారం ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన ఈడీ అధికారులు 4 గంటల పాటు వేచి చూసి హరి ఓం రాయ్ రాలేదు అనుకొని కార్డియాలజీ విభాగానికి వెళ్లారు.

అక్కడ నిందితుడికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయని డాక్టర్లు చెప్పడంతో అవాక్కయ్యారు. లోపలికి వెళ్లి చూడటంతో అసలు విషయం బయటపడింది. రాయ్ పేరుతో మరో వ్యక్తికి వైద్యపరీక్షలు జరుగుతున్నాయి. అతడ్ని విచారించగా.. తన పేరు నావల్ కిశోర్ అని, ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారని చెప్పడంతో ఇక్కడికి వచ్చానని చెప్పాడు. ఖంగు తిన్న ఈడీ అధికారులు జరిగిన విషయాన్ని కోర్టు ముందు పెట్టారు. దీంతో అతడి పిటీషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది. అనంతరం పోలీసులు హరిఓం రాయ్ ని అరెస్ట్ చేసి తిహార్ జైలుకు పంపించారు.

కాగా ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ అయినా లావా కంపెనీ ఆర్ధిక లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో మనీ లాండరింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఆ సంస్ధ చైర్మన్, ఎండీగా ఉన్న హరి ఓం రాయ్ తో పాటు కంపెనీకి చెందిన మరి కొందరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు వైద్య కారణాల దృష్యా తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అయితే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న తనకు బెయిల్ పొడగించాలని కోరుతూ.. ఇటీవల రాయ్ మరో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను సమర్పించాలని ఈడీ అధికారులను ఆదేశించింది.


Similar News