కోటాలో నీట్ విద్యార్థి సూసైడ్: ఈ ఏడాది తొమ్మిదో ఘటన

దేశంలోనే కోచింగ్ హబ్‌గా పేరుపొందిన రాజస్థాన్‌లోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా

Update: 2024-04-29 07:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోనే కోచింగ్ హబ్‌గా పేరుపొందిన రాజస్థాన్‌లోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా..తాజాగా మరో విద్యార్థి సూసైడ్‌కు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హర్యానాలోని రోహ్ తక్‌కు చెందిన విద్యార్థి సుమిత్(20) గతేడాది కాలంగా కోటాలోనే ఉంటూ నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు ప్రిపేరవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. దీంతో వార్డెన్ సుమిత్ గదికి వెళ్లి చూడగా ఊరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. గతేడాది మొత్తం 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 

Tags:    

Similar News