రాహుల్ గాంధీ బహిరంగ సభలో కూలిన స్టేజీ

స్టేజ్ కూలిన సమయంలో రాహుల్ గాంధీ మీసా భారతీ చేయి పట్టుకుని ఉన్నారు.

Update: 2024-05-27 11:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రచారం చివరిదశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో పూర్తిగా సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ప్రతిపక్ష ఇండియా కూటమి బీహార్, పాట్నాలోని పాలిగంజ్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మీసా భారతీ, తేజస్వి యాదవ్ సహా ఇతర ముఖ్యమైన నేతలు చేరుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో కీలక నేతలందరూ ఉండగానే అకస్మాత్తుగా స్టేజీ కూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. స్టేజ్ కూలిన సమయంలో రాహుల్ గాంధీ మీసా భారతీ చేయి పట్టుకుని ఉన్నారు. వెంటనే భద్రతా సిబ్బంది రాహుల్ వద్దకు చేరుకుని కిందకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో రాహుల్ గాంధీ వారిని వారించి తాను క్షేమంగా ఉన్నట్టు సంకేతమిచ్చారు. ప్రజలవైపు తిరిగి అభివాదం చేస్తూ కిందకు వెళ్లారు. అలాగే, అక్కడే ఉన్న మరికొందరు నేతలు వేదికపైనే ఉన్న తేజస్వి యాదవ్‌ను పట్టుకున్నారు. కాగా, దేశీయంగా ఇప్పటివరకు ఆరు దశల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. చివరి దశ జూన్ 1న జరగనుంది. ఈ విడత 57 స్థానాల్లో ఓటింగ్ జరుగుతుంది. 

Tags:    

Similar News