పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఆ ఆలయానికి దాని కోసం వస్తున్న భక్తులు.. నెటిజన్స్ ఫైర్..

యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్రలతో కూడిన చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైన విషయం తెలిసిందే.

Update: 2024-05-16 12:53 GMT

దిశ వెబ్ డెస్క్: యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్రలతో కూడిన చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేదార్‌నాథ్‌కు భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. అయితే వీళ్లలో భక్తితో వచ్చేవారి కంటే ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ కంటెంట్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి  రీల్స్ తీసి అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా, ఆ వీడియో కాస్త వైరల్ అయితే చాలు, అందరూ ఆ ప్రదేశంలో వాలిపోతుంటారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు, వ్లాగర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌కు భక్తిశ్రద్ధలతో కాకుండా కేవలం సోషల్ మీడియా కంటెంట్ కోసం తండోపతండాలుగా వెళ్లడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కేదార్‌నాథ్ వంటి ప్రదేశాలు ప్రకృతితో మమేకమై భక్తి పారవశ్యంలో తేలియాడే వారి కోసమే అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు.

కాగా నెటిజెన్స్ పోస్ట్‌లపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి మాట్లాడుతూ.. ఇకపై కేదార్‌నాథ్ ఆలయం లోపలికి మొబైల్ ఫోన్స్ నిషిద్ధం అని వెల్లడించారు. ఆలయానికి 200 మీటర్ల దూరం వరకు మాత్రమే మొబైల్ ఫోన్స్‌ను అనుమతిస్తామని తెలిపారు. కాగా ఈ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అలానే చార్‌ధామ్ యాత్రకు వచ్చే వాళ్ళు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆమె పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా కేదార్‌నాథ్‌కు రావద్దు అని తెలిపారు. 

Similar News