లండన్‌లో వేలానికి 1918 నౌక ప్రమాదంలో లభించిన అరుదైన భారతీయ నోట్లు

1918 నాటి ఐరిష్ తీరంలో సముద్రంలో మునిగిపోయిన ఆ రెండు రూ. 10 నోట్లు ఇప్పుడు లండన్‌లో వేలానికి రానున్నాయి.

Update: 2024-05-24 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అది 1918వ సంవత్సరం. మద్యం, మందుగుండు సామగ్రి, ఇతర పదార్థాలతో బొంబాయి నుంచి లండన్‌కు వెళ్తున్న ఒక ఓడ జర్మన్ యూ-బోటు నుంచి వచ్చిన మిస్సైల్‌తో ఢీకొనడంతో మునిగిపోయింది. అయితే, ఈ ఘటనలో రెండు భారతీయ కరెన్సీ నోట్లు ఆ ఓడలో ఉన్నాయి. 1918 నాటి ఐరిష్ తీరంలో సముద్రంలో మునిగిపోయిన ఆ రెండు రూ. 10 నోట్లు ఇప్పుడు లండన్‌లో వేలానికి రానున్నాయి. ఈ నెల 29న ప్రపంచ బ్యాంకు నోట్ల విక్రయంలో భాగంగా లండన్‌లోని నూనన్స్ మేఫెయిల్ వేలం హౌస్‌లో వీటిని వేలానికి ఉంచనున్నారు. ఈ అరుదైన భారతీయ నోట్లు 2,000 నుంచి 2,600 పౌండ్ల వరకు పలకవచ్చని అంచనా. 1918, మే 25న జారీ చేసిన ఈ రూ. 10 నోట్లు 1918, జూలై 2న జర్మన్ యూ-బోట్ కారణంగా ధ్వంసమైన ఎస్ఎస్ షిరాలా అనే ఓడలో లభించాయి. ఆనాడు జరిగిన ప్రమాదంలో సంతకం లేని 5,10 రూపాయల సహా అనేక నోట్లు ఒడ్డుకు చేరాయి. సంతకం చేసిన రూ. 1 నోటు కూడా ఈ వేలంలో ప్రదర్శించబడింది. చాలా నోట్లను అధికారులు ద్వంసం చేయగా, కొన్నిటినీ పునర్ముద్రించారు. అయితే, కొన్నిటిని ప్రైవేటు వ్యక్తులు సేకరించారని నూనన్స్‌లోని న్యూమిస్మాటిక్స్ హెడ్ థామస్సినా స్మిత్ చెప్పారు. ఇలాంటి అరుదైన నోట్లను తానెప్పుడూ చూడలేదని ఆమె పేర్కొన్నారు. ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సోషల్ మీడియాలో 1918 నాటి నౌక ప్రమాదంలో లభించిన నోట్లుగా ప్రస్తావించడంతో ఆ నోట్లు అందరి దృష్టిని ఆకర్షించాయని ఆమె వెల్లడించారు. ఇవి కాకుండా మరో రూ. 100 నోటు కూడా ఈ వేలంలో ఉందని, ఇది బ్రిటీష్ వలస కాలానికి చెందిందని సంబంధిత అధికారులు చెప్పారు. ఇది వేలంలో 4,400 నుంచి 5,000 పౌండ్ల వరకు వేలానికి రావొచ్చు. ఈ నోటు కలకత్తాలో సంతకం, స్టాంప్ వేయబడింది. 1917, 1930 నాటిది అయ్యుండొచ్చని భావిస్తున్నారు. 

Tags:    

Similar News