అతివేగంతో రైళ్లను నడిపిన లోకో పైలట్లపై సస్పెన్షన్ వేటు

గతిమాన్, మాల్వా ఎక్స్ ప్రెస్ రైళ్ల లోకోపైలట్లపై సస్పెన్షన్ వేటు పడింది. అతివేగంతో రైళ్లు నడిపిన కారణంగా వారిని సస్పెండ్ చేస్తూ రైల్వేశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2024-05-24 18:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గతిమాన్, మాల్వా ఎక్స్ ప్రెస్ రైళ్ల లోకోపైలట్లపై సస్పెన్షన్ వేటు పడింది. అతివేగంతో రైళ్లు నడిపిన కారణంగా వారిని సస్పెండ్ చేస్తూ రైల్వేశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన చోట.. 120 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిపై వేటు వేశారు.

ఆగ్రా కంటోన్మెంట్‌కు సమీపంలోని జజువా, మనియా రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ఆ మార్గంలో వెళ్లే రైళ్ల వేగాన్ని గంటకు 20 కిలోమీటర్లు తగ్గించారు. అయితే, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్- యూపీలోని ఝాన్సీ జంక్షన్ల మధ్య నడిచే గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రం గంటకు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో నడిచింది. ఇది జరిగిన మూడ్రోజులకే జమ్మూలోని కాట్రా- మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మధ్య నడిచే మాల్వా ఎక్స్ ప్రెస్ కూడా ఆ ప్రాంతంలో అతివేగంతో దూసుకెళ్లింది. ముందస్తుగా హెచ్చరించినప్పటికీ లోకోపైలట్లు ఇలాంటి తప్పుచేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు రైల్వే అధికారులు. స్పీడు తగ్గించకపోవడం.. వందలమంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్ లో పెట్టడమే అవుతుందన్నారు. అందుకే లోకోపైలట్లపై వేటు తప్పలేదని అధికారులు పేర్కొన్నారు

Similar News