దేశ సైనికులను కార్మికుల్లా చూస్తున్నారు.. అగ్నివీర్ స్కీం రద్దు: రాహుల్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నివీర్‌ పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు.

Update: 2024-05-22 12:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నివీర్‌ పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశ యువత సరిహద్దులను కాపాడుతున్నారు. వారి హృదయంలో దేశభక్తి ఉంది. కానీ ప్రధాని మోడీ అగ్నివీర్ పథకాన్ని ప్రవేశపెట్టి భారత జవాన్లను కార్మికుల్లాగా మార్చారు. ఆర్మీకి అగ్నివీర్ పథకం అవసరం లేదు. ఇది పీఎంఓ చేసిన పథకం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా చెత్తబుట్టలో పారవేస్తామని రాహుల్‌ తెలిపారు.

మోడీ అమరవీరులు రెండు రకాలుగా ఉన్నారని చెప్పారు, ఒకరు సాధారణ జవాన్ లేదా అధికారి. వారి కుటుంబానికి పింఛను, ఇతర ప్రయోజనాలన్నీ అందుతాయి. మరొకరమే అగ్నివీర్ అని పేరు పెట్టబడిన పేద కుటుంబాలకు చెందిన యువకులు ... వారు అమరవీరులుగా పరిగణించబడరు, వారికి పింఛన్లు, ఇతర ప్రయోజనాలను అందవు, అందుకే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ పథకాన్ని తీసేస్తామని రాహుల్ అన్నారు.

రైతుల రుణమాఫీ అంశంపై మాట్లాడిన ఆయన, దేశంలోని కొంతమంది పెట్టుబడిదారుల రూ. 16 లక్షల కోట్ల రుణాన్ని ప్రధాని మోడీ మాఫీ చేశారు. మరి రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తుందని ఆయన అన్నారు. వేల కిలోమీటర్ల మేర 'భారత్ జోడో యాత్ర' చేశాను, వెళ్ళిన ప్రతి చోట అక్కడ ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మోడీ రైతుల సమస్యలు, ఉద్యోగాలు గురించి మాట్లాడరని రాహుల్ ప్రధానిపై విమర్శలు చేశారు.

Similar News