మోడీజీ ఈడీ, సీబీఐలను అంబానీ, అదానీలపైకి పంపండి : రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఒక వీడియో సందేశం విడుదల చేసిన రాహుల్ గాంధీ.. అందులో అంబానీ- అదానీ ఒప్పందంపై మాట్లాడారు.

Update: 2024-05-08 17:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఒక వీడియో సందేశం విడుదల చేసిన రాహుల్ గాంధీ.. అందులో అంబానీ- అదానీ ఒప్పందంపై మాట్లాడారు. నమస్కార్ మోడీజీ.. మీరు భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. సాధారణంగా అంబానీ, అదానీల గురించి రహస్యంగా మాట్లాడతారు అన్నారు. మీరు మొదటిసారిగా 'అంబానీ', 'అదానీ' అని బహిరంగంగా చెప్పారని గుర్తుచేశారు.

వరంగల్ లో జరిగిన సభలో అంబానీ-అదానీలతో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందా అని ప్రశ్నించారు మోడీ. అంబానీ అదానీల నుంచి కాంగ్రెస్ ఎంత ఎత్తుకెళ్లిందో షెహజాదాని ప్రకటించనివ్వండి అని అన్నారు. తెలంగాణ గడ్డ నుంచి ఈ విషయాన్ని అడగాలనుకుంటున్నా అని రాహుల్ ని ఉద్దేశించి ప్రధాని విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు టెంపో లోడ్ కరెన్సీ నోట్లు కాంగ్రెస్ కు చేరాయా? ఏ ఒప్పందం కుదిరింది? అంబానీ- అదానీ దుర్వినియోగం రాత్రికి రాత్రే ఆగిపోయిందా? అని మోడీ అన్నారు.

ప్రధానమంత్రి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. అంబానీ- అదానీ టెంపోలలో డబ్బుఇస్తారని మీకు కూడా తెలుసా.. అది మీ వ్యక్తిగత అనుభవమా? అని చురకలు అంటించారు. పారిశ్రామికవేత్తలపైకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలను పంపాలని మోడీని కోరారు. వీలైనంత త్వరగా విచారణ జరిపించాలని విన్నవించారు. మోడీ పారిశ్రామిక వేత్తలకు ఎంత డబ్బు ఇచ్చారో.. కాంగ్రెస్ దేశంలోని పేదలకు అంతే మొత్తాన్ని ఇస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ 22 మంది కోటీశ్వరులను చేసిందని.. తాము కోట్లాది మందిని కోటీశ్వరులను చేస్తామని అన్నారు.

Similar News