సీఎం ఇంటి ఎదురుగా 1980 నుంచి ముసి ఉన్న రోడ్డు ప్రారంభంపై సుప్రీంకోర్టు స్టే

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి నయా గావ్ రోడ్డును ప్రారంభించడాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది.

Update: 2024-05-03 12:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి నయా గావ్ రోడ్డును ప్రారంభించడాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సును నయాగావ్‌ను కలుపుతూ ఉన్న 500 మీటర్ల రహదారిని మే 1 నుంచి ప్రారంభించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం రెండూ దీనిని వ్యతిరేకించి, సుప్రీం కోర్టుకు వెళ్లగా ఈ రోడ్డు ప్రారంభానికి సంబంధించిన భద్రతా బెదిరింపుల గురించి కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం రెండూ లేవనెత్తిన ఆందోళనలకు పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం రోడ్డు ప్రారంభాన్ని నిలిపివేసింది.

పంజాబ్‌లో ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ రహదారిని 1980 నుంచి ముసి ఉంచారు. అయితే అక్కడ ఉన్న నయాగావ్, సుఖ్నా సరస్సు మధ్య వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారు నగరంలోని ప్రక్కనే ఉన్న ఇతర మార్గాల ద్వారా వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈ మార్గాల్లో ప్రయాణానికి చాలా సమయం పడుతుండటంతో, వారి సమస్య పరిష్కారానికి పంజాబ్-హర్యానా హైకోర్టు రోడ్డును ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని, దీని కోసం ప్రణాళికను సిద్ధం చేయాలని చండీగఢ్ పోలీసులను ఏప్రిల్ 22న ఆదేశించింది. దీంతో పంజాబ్, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా భద్రతా కారణాల దృష్ట్యా రోడ్డు ప్రారంభాన్ని నిలిపివేసింది.


Similar News