పుణే ప్రమాదం కేసు.. మైనర్ నిందితుడి తండ్రికి జూన్ 7 వరకు కస్టడీ

మహారాష్ట్రలోని పూణేలో జరిగిన లగ్జరీ పోర్షే కారు ప్రమాద ఘటనలో శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Update: 2024-05-24 16:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని పూణేలో జరిగిన లగ్జరీ పోర్షే కారు ప్రమాద ఘటనలో శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కారు ప్రమాదానికి కారకుడైన మైనర్ నిందితుడి తండ్రిని కోర్టు

జూన్ 7 వరకు కస్టడీకి పంపింది. విచారణకు నిందితుడి తండ్రి సహకరించట్లేదని పోలీసులు తెలపడంతో కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన 17 ఏళ్ల బాలుడిని జూన్ 5 వరకు జువైనల్ కస్టడీకి పంపింది కోర్టు.వ్యాపారవేత్త అయిన నిందితుడి తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. మైనర్ బాలుడు యాక్సిడెంట్ చేసిన తర్వాత అతడి తండ్రి పరారయ్యాడు. కార్లు మారుస్తూ, సిమ్ లు మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో ఒక డ్రైవర్‌ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు సీపీ అమితేష్ కుమార్ వెల్లడించారు. ఈ యాక్సిడెంట్ తానే చేసినట్లు ఒప్పుకోవాలని ఓ డ్రైవర్‌‌ను బాలుడి పేరెంట్స్ మభ్యపెట్టినట్లు తెలిపారు. నేరాన్ని తనపై వేసుకుంటే డబ్బులు ఇస్తామని సదరు డ్రైవర్ కు ఆశచూపించినట్లు చెబుతున్నారు. ఇక ఈ కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 2.15గంటలకు ప్రమాదం జరగగా.. కొన్ని గంటల వరకు మైనర్ నిందితుడికి వైద్యపరీక్షలు నిర్వహించలేదని సమాచారం. మరోవైపు ఈ కారు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు యువకుల తల్లిదండ్రులు ఈ కేసు దర్యాప్తు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. విచారణను మహారాష్ట్రలో కాకుండా బాధితుల స్వస్థలం మధ్యప్రదేశ్‌లో చేపట్టాలన్నారు.

ఇద్దరు పోలీసు అధికారులు సస్పెండ్

పూణే కారు ప్రమాదం కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఎరవాడ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ రాహుల్ జగ్దాలే, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ తోడ్కరీలను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు అధికారులు కారు ప్రమాదం సమాచారాన్ని వైర్‌లెస్ కంట్రోల్ రూమ్‌కు సకాలంలో తెలియజేయడంలో విఫలమయ్యారని పోలీసులు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసు విచారణ ఎరవాడ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరగగా..తాజాగా దాన్ని పూణే క్రైమ్ బ్రాంచ్‌‌కు బదిలీ చేశారు.

Similar News