ప్రజ్వల్ రేవణ్ణపై లుక్‌ అవుట్ నోటీసులు.. దేశంలోకి అడుగుపెట్టగానే అదుపులోకి

కర్ణాటకలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు రాగా, జేడీఎస్‌ పార్టీ ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-05-02 08:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు రాగా, జేడీఎస్‌ పార్టీ ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రేవణ్ణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరుకాకపోవడంతో ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. సర్క్యులర్ జారీ చేసిన కారణంగా ఆయన దేశంలోకి ప్రవేశించిన వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం, కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, తమ ముందు విచారణకు హాజరు కావాలని ప్రజ్వల్, ఆయన తండ్రికి సమన్లు జారీ చేసింది. కానీ ఆయన ప్రస్తుతం ఇండియాలో లేరు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత దేశం విడిచి వెళ్లారు. దీంతో సిట్ ముందు విచారణకు హాజరుకాకపోవడంతో తాజాగా లుక్‌అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.

నిన్న సిట్ సమన్లపై స్పందించిన ప్రజ్వల్ ఎక్స్‌లో ఈ విధంగా రాశారు, తాను ప్రస్తుతం బెంగళూరులో లేనందున విచారణకు హాజరు కాలేను, నా లాయర్ ద్వారా అధికారులను సంప్రదిస్తాను, నిజం గెలుస్తుందని అన్నారు. కర్ణాటక రాజకీయాల్లో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ విషయంపై మాటల యుద్ధం నడుస్తోంది. హాసన్‌లో పర్యటించి బాధితులను కలవాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరగా, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోవడాన్ని అమిత్ షా తప్పుబట్టారు.

Similar News