శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోడీ నుంచి నటి ప్రణీత దాకా రియాక్షన్స్

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Update: 2024-05-08 14:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అవి కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల ‘వారసత్వ పన్ను’పై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న పిట్రోడా.. తాజాగా భారత్‌‌ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో చెప్పిన పోలికలు వివాదాస్పదమయ్యాయి. ‘ది స్టేట్స్‌మన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వంపై శామ్‌ పిట్రోడా మాట్లాడారు. ‘‘లౌకిక దేశాన్ని సాధించడం కోసం మన స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటీషర్లతో పోరాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మన దేశమే ఉత్తమ నిదర్శనం. మనది వైవిధ్యమైన దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమ వాసులు అరబ్బుల్లా కనిపిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. మనమంతా సోదర సోదరీమణులమే. భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లో పాతుకుపోయాయి’’ అని ఆయన చెప్పారు.

ప్రధాని మోడీ ఏమన్నారంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యల్ని తెలంగాణ, కర్ణాటక సీఎంలు అంగీకరిస్తారా..? అని మోడీ ప్రశ్నించారు. ‘‘ఈశాన్య భారతదేశంలోని వారు చైనీస్‌‌లా కనిపిస్తున్నారని కాంగ్రెస్ అంటోంది. దేశం ఇలాంటి వాటిని అంగీకరించగలదా? కాంగ్రెస్ దక్షిణాది ప్రజలను ఆఫ్రికన్లలా చూస్తోంది. వారు దీన్ని అంగీకరిస్తారా?’’ అని ప్రధాని మోడీ అడిగారు. ‘‘చర్మం రంగు నల్లగా ఉండేవారు ఆఫ్రికా వారని శామ్ పిట్రోడా అనడం నాకు చాలా కోపాన్ని తెప్పించింది. దేశ ప్రజలను చర్మం రంగును బట్టి వర్గీకరిస్తారా..? నేను ఉన్నంతవరకు అలా జరగనివ్వను’’ అంటూ ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలతో తమిళులను కించపరుస్తున్న కాంగ్రెస్ పార్టీతో బంధాన్ని తెంచుకునే దమ్ము డీఎంకే పార్టీకి, సీఎం స్టాలిన్‌కు ఉందా అని మోడీ ప్రశ్నించారు. ఒక పెద్ద నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ‘‘పశ్చిమ ప్రాంత ప్రజలు అరబ్బుల్లా కనిపిస్తారని పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని ఆ ప్రాంత ప్రజలు అంగీకరిస్తారా ?’’ అని మోడీ ప్రశ్నించారు. ‘‘ఉత్తర భారతీయులు తెల్లవారిలా కనిపిస్తారా..? కాంగ్రెస్ పార్టీకి ఏమైంది..?’’ అంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి శామ్ పిట్రోడాయే తాత్విక మార్గదర్శకుడన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను దేశం వింటోందని, ఆ పార్టీని శిక్షించాలని ఓటర్లను ప్రధాని కోరారు.

ఇది ఆక్రమణదారుల భూమి అని కాంగ్రెస్ నమ్ముతోంది : అన్నామలై

‘‘భారతదేశం ఆక్రమణదారుల భూమి అని కాంగ్రెస్ నమ్ముతోంది. అందుకే ఇలా మాట్లాడుతోంది’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం, ఆలోచన అలాగే ఉంటుందని విమర్శించారు. ‘‘మనం చైనీయుల్లా, ఆఫ్రికన్లలా కనిపించినా తప్పేం లేదు.. కానీ మనం ఈ దేశ వారసులం కాదా? మనం భారతీయులం కాదా?’’ అని ఆయన ప్రశ్నించారు.

దేశాన్ని విభజించి పాలించే మనస్తత్వం ఇది : మణిపూర్ సీఎం

దేశంలోని తూర్పు ప్రాంత ప్రజలను శామ్ పిట్రోడా చైనీయులతో పోల్చడంపై మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఫైర్ అయ్యారు. ‘‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం. భారత భౌగోళిక కూర్పు పిట్రోడాకు తెలియదు’’ అని ఆయన చెప్పారు. దేశాన్ని విభజించి పాలించే మనస్తత్వం ఉండటం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తూర్పు ప్రాంత ప్రజలంతా భారతదేశంలో భాగమని స్పష్టం చేశారు.

హీరోయిన్ ప్రణీత ట్వీట్ వైరల్

శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై స్టార్ హీరోయిన్ ప్రణీత సుభాష్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. ఆమె తన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘నేను దక్షిణ భారతీయురాలిని. భారతీయురాలిలా కనిపిస్తున్నానా’’ అనే కామెంట్‌ను రాశారు. దీనికి శామ్ పిట్రోడాను ట్యాగ్ చేశారు. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యల వీడియోను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. దాన్ని రీట్వీట్ చేస్తూ ప్రణీత తన పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన నెటిజన్స్.. ‘‘మనం ఇండియన్స్ కానీ శామ్ పిట్రోడాకు ఆఫ్రికా వాళ్లలా కనిపిస్తున్నాం’’ అని కామెంట్స్ పెట్టారు.

వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన..

శామ్ పిట్రోడా చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. దేశంలోని భిన్నత్వం గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదించదగినవి కావన్నారు. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా

తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ విభాగం ఛైర్మన్ పదవికి శ్యామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. వెంటనే పిట్రోడా రాజీనామాను ఖర్గే ఆమోదించారు. ఇటీవల కాలంలో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం వల్లే ఖర్గే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News