పన్నూ హత్య కుట్రకేసులో అమెరికాకు చెక్..!

ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికాకు షాక్ తగిలింది.

Update: 2024-05-07 07:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికాకు షాక్ తగిలింది. అమెరికా ఏజెన్సీలకు చెక్ రిపబ్లిక్ చెక్ పెట్టింది. ఈ కేసులో నిందితుడైన భారతీయుడు నిఖిల్ గుప్తాను అప్పగించే విషయంలో అమెరికాకు చుక్కెదురైంది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. అతడిని అప్పగించే విషయంలో లేట్ అయితే ఎలాంటి ప్రజాప్రయోజనాలు దెబ్బతినవని విమర్శించింది. ఈ అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే వరకు ఏమీ చేయలేమని చెక్ రిపబ్లిక్ జస్టిస్ మినిస్టర్ మార్కెటా ఆండ్రోవా తెలిపారు.

19 జనవరి 2024లో నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ స్థానిక మున్సిపల్‌ కోర్టు, హైకోర్టు నిర్ణయాలను ఆయన సవాలు చేశారు. దీనిపై అత్యున్నత కోర్టుని ఆశ్రయించారు. అమెరికా క్రిమినల్ ప్రాసిక్యూషన్ వల్ల నిఖిల్ గుప్తాకే ఎక్కువగా నష్టం జరుగుతోందని కోర్టు పేర్కొంది.

దీనిపై చెక్‌రిపబ్లిక్‌ అధికారులు స్పందిస్తూ.. కింది కోర్టు నిర్ణయాలను సస్పెండ్‌ చేయడం అంటే.. అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో వాస్తవాలపై దృష్టి సారించిందని అర్థం అన్నారు. ఈ కేసులో ఏ నిర్ణయానికి వచ్చే వరకు ఫిర్యాదుదారుడి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా కోర్టు చూస్తుందన్నారు.

చెక్‌ రిపబ్లిక్‌- అమెరికా మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ఉంది. దీంతో,వాషింగ్టన్‌ అభ్యర్థన మేరకు గతేడాది జూన్‌ 30న ప్రాగ్‌లోకి అడుగుపెట్టిన నిఖిల్‌ గుప్తాను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా పౌరుడు పన్నూ హత్యకు అతడు సుపారీకి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానిక అధికారులు నిఖిల్‌ గుప్తా విషయంలో మానవ హక్కులను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Similar News