ప్రధాని మోడీ ప్రకటనలు విచిత్రంగా ఉన్నాయి: పి చిదంబరం
ఆ మరుసటి రోజు నుంచే మోడీ హిందూ-ముస్లింల విభజన గేమ్‌ను ప్రారంభించాడని చిదంబరం విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో: బడ్జెట్‌లో ముస్లింలకు కేటాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తీవ్రంగా స్పందించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు బడ్జెట్‌లో 15 శాతం కేటాయించేదన్న మోడీ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని చిదంబరం అన్నారు. గత కొద్దిరోజుల నుంచి ప్రధాని మోడీ ప్రకటనలు విచిత్రంగా ఉన్నాయని గురువారం ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. హిందూ-ముస్లిం అనే విభజన వ్యాఖ్యలు చేయలేదని, అలా చేస్తే ప్రజా జీవితంలో ఉండేందుకు తనకు అర్హత ఉండదని ప్రధాని మోడీ ఇటీవల చెప్పారు. కానీ, ఆ మరుసటి రోజు నుంచే హిందూ-ముస్లింల విభజన గేమ్‌ను ప్రారంభించాడని చిదంబరం విమర్శించారు. దీన్నిబట్టి గౌరవనీయులైన ప్రధాని ప్రకటనలు విచితంగా ఉన్నాయని తెలుస్తోంది. ఆయన ప్రసంగం బ్యాలెన్స్ తప్పుతోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ముస్లిం, హిందూ అంటూ వేర్వేరు బడ్జట్‌లను ప్రవేశపెడుతుందని మోడీ చేసిన ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇది కేవలం ఆయన భ్రమ మాత్రమేనని చిదంబరం పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 కేవలం ఒక వార్షిక బడ్జెట్‌ను సమర్థిస్తుంది. అలాంటపుడు రెండు బడ్జెట్‌లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మిగిలిన కొద్దిరోజులైనా ప్రధాని మోడీ తప్పుడు ఆరోపణలు, దారుణమైన వింత వాదనలు చేయకుండా ఉండాలని ఆశిస్తున్నట్టు చిదంబరం ఎద్దేవా చేశారు. భారత ప్రధాని ప్రకటనలను దేశ ప్రజలే కాదు, ప్రపంచం కూడా గమనిస్తోంది, విశ్లేషిస్తోందని గుర్తుచేశారు.