రేపే ఆరో దశ పోలింగ్‌.. ఓటు వేయనున్న 11.53 కోట్ల మంది ఓటర్లు

మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉండగా,అత్యధికంగా హర్యానాలో 223 మంది, అత్యల్పంగా జమ్మూ కశ్మీర్‌లో 20 మంది పోటీలో ఉన్నారు

Update: 2024-05-24 13:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. మొత్తం ఏడు దశల పోలింగ్ ప్రక్రియలో ఐదు దశలు విజయవంతంగా పూర్తవగా, శనివారం ఆరో దశ ఓట్ల పండుగ జరగనుంది. ఈసారి ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్ (8), హర్యానా (10), జమ్మూకశ్మీర్ (1), జార్ఖండ్ (4), ఢిల్లీ(7), ఒడిశా (6), ఉత్తరప్రదేశ్ (14), పశ్చిమ బెంగాల్ (8) స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ విడతలో దాదాపు 11.53 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లో 64.4 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అత్యధికంగా హర్యానాలో 223 మంది, అత్యల్పంగా జమ్మూ కశ్మీర్‌లో 20 మంది పోటీలో ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 162 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బీహార్‌లో 86 మంది, జార్ఖండ్‌లో 93 మంది, ఒడిశాలో 64 మంది, పశ్చిమ బెంగాల్‌లో 79 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, మనోహర్ లాల్ ఖట్టర్, మెహబూబా ముఫ్తీ, మేనకా గాంధీ, దీపేంద్ర సింగ్ హుడా వంటి కీలక అభ్యర్థులు ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో ఓటింగ్ కోసం 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను 11.4 లక్షల మంది పోలింగ్ అధికారులను ఎన్నికల సంఘం మోహరించింది. 

Tags:    

Similar News