10 లక్షల మందిలో 7 గురికి మాత్రమే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌: ICMR మాజీ శాస్త్రవేత్త

కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌ ప్రమాదాన్ని చాలా తక్కువ మంది మాత్రమే ఎదుర్కొంటారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేద్కర్ అన్నారు

Update: 2024-05-01 08:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌ ప్రమాదాన్ని చాలా తక్కువ మంది మాత్రమే ఎదుర్కొంటారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేద్కర్ అన్నారు. 10 లక్షల మందిలో దాదాపు తక్కువలో తక్కువ 7 మంది మాత్రమే థ్రాంబోసిస్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS) అని పిలిచే అరుదైన సైడ్ ఎఫెక్ట్స్‌‌కు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ప్రజలు మొదటి డోస్ తీసుకున్నప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది రెండవ డోస్‌తో తగ్గుతుంది, మూడవ డోస్‌తో మరింత తక్కువగా ఉంటుంది. ప్రారంభ రెండు మూడు నెలల్లో ఏవైనా దుష్ప్రభావాలు కనిపించవచ్చని శాస్త్రవేత్త చెప్పారు. టీకా తీసుకున్న మిలియన్ల మందిపై సానుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ సంబంధిత ప్రమాదం తక్కువగా ఉందని ఆయన తెలిపారు.

ఇటీవల, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా, దాని కోవిడ్-19 వ్యాక్సిన్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS) అంటే రక్తం గడ్డకట్టడం అనే అరుదైన ప్రమాదానికి కారణమవుతుందని యూకే లోని కోర్టులో అంగీకరించిన నేపథ్యంలో ICMR మాజీ శాస్త్రవేత్త బుధవారం ఈ విధమైన ప్రకటన చేశారు. భారతదేశంలో, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను కోవిషీల్డ్ పేరుతో సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఉత్పత్తి చేసి విక్రయించింది. ఈ టీకా వలన రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని కోర్టులో పలువురు కేసులు వేయగా, ఆస్ట్రాజెనెకా కంపెనీ తాజాగా దాని టీకా వలన చాలా తక్కువ మందిలో మాత్రమే ఇలాంటి ప్రభావం చూపిస్తుందని అంగీకరించింది.


Similar News