పథకాలు ఆగిపోతాయనే పుకార్లు నమ్మొద్దు: ఢిల్లీ ప్రభుత్వం

ప్రజలకు సంబంధించిన సేవలు, సామాజిక సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై ఎలాంటి ప్రభావం చూపదని ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

Update: 2024-03-26 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి వస్తున్న పుకార్లపై ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రజలకు సంబంధించిన సేవలు, సామాజిక సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై ఎలాంటి ప్రభావం చూపదని ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ మంగళవారం ప్రకటనలో తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్ కారణంగా ఢిల్లీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సబ్సీడీలు ఆగిపోతాయనే తప్పుడు ప్రచారం జరుగుతున్న కారణంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అబద్దపు ప్రచారం నమ్మొద్దని, నేర పరిశోధన విషయంలోనూ చట్టం తన పని తాను చేస్తుందని, పథకాలు, పాలన ఏవీ ఆగవని స్పష్టం చేసింది. ఢిల్లీలో స్వార్థ ప్రయోజనాలతో కొందరు వ్యక్తులు ఊహాగానాలు, పుకార్లను సృష్టిస్తున్నారు. దుష్ప్రచారం ద్వారా సామాన్యూల్లో భయాందోళనలు రేకెత్తించాలని చూస్తున్నారని ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి నిహారికా రాయ్ పేర్కొన్నారు. ఈ ప్రకటన సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు వెలువరించినట్టు అధికారులు వెల్లడించాయి. అన్ని పథకాలు, సబ్సిడీలు, సేవలు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతాయని చెప్పారు. 

Tags:    

Similar News