నెల రోజుల్లో రూ.35 లక్షల చక్కెర తినేసిన కోతులు.. అధికారుల కన్నింగ్ నిర్వాకానికి షాకైన ఉన్నతాధికారులు

కోతుల పేరు చెప్పి చక్కర కుంభకోణానికి పాల్పడిన అధికారుల గుట్టు రట్టయింది.

Update: 2024-05-23 10:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:నెల రోజుల వ్యవధిలో 11 వందల క్వింటాళ్ల విలువ చేసే చెక్కరను కోతులు తినేసిన షాకింగ్ ఘటన యూపీలో వెలుగు చూసింది. ఆ చెక్కర విలువ అక్షరాల రూ.35 లక్షలు కావడంతో కోతులు ఇంత పని చేశాయా అని అందరూ ఆశ్చర్యపడుతుంటే అసలు విషయం తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అలీఘర్ లో కోతుల పేరుతో షుగర్ కుంభకోణంలో అధికారులు చూపించిన చేతివాటం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింటే.. అలీఘర్ లో ఉన్న బందర్ సాథ షుగర్ మిల్లులో 30 రోజుల్లోనే రూ.35 లక్షల విలువైన 11 వందల క్వింటాళ్లకు పైగా చక్కెర మాయమైంది. అయితే అక్కడి కోతులు పెద్ద మొత్తంలో చెక్కరను బుక్కెయ్యడమే దీనికి కారణం అని షుగర్ మిల్స్ లిమిటెడ్ ఆడిట్ నివేదికలో అధికారులు పేర్కొన్నారు.

ది కిసాన్ కోపరేటివ్ షుగర్ మిల్ లిమిటెడ్ లో ఇటీవల జిల్లా ఆడిట్ అధికారులు, సహకార సంఘాలు, పంచాయతీ ఆడిట్ అధికారులు ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాక్ రికార్డులు పరిశీలించగా ఈ విషయం వెలుగు చూసింది. పెద్ద మొత్తంలో కోతులు తినడం, వర్షం కారణంగా చక్కెర చెడిపోయిందనే సాకుతో చక్కెర స్కామ్ కు పాల్పడ్డారని ఈ కుంభకోణంలో మేనేజర్, అకౌంట్స్ అధికారి సహా ఆరుగురిని దోషులుగా ఉన్నతాధికారులు నిర్ధారించారు. దీంతో అధికారుల నిర్వాకంపై ఖంగు తిన్న ఉన్నతాధికారులు అక్రమంగా కాజేసిన చక్కెర విలువను సదరు అధికారుల జేబులో నుంచి కక్కిస్తామని సహకార సంఘాల అసిస్టెంట్ ఆడిట్ అధికారి వినోద్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News