పుట్టబోయే బిడ్డ లింగం తెలుసుకునేందుకు భార్య గర్భాన్ని కోసిన భర్త.. కోర్టు సంచలన తీర్పు

తన భార్య గర్భంలో పెరుగుతున్నది ఆడ బిడ్డో, మగ బిడ్డో తెలుసుకునేందుకు కొడవలితో భార్య పొట్టను చీల్చిన ఓ రాక్షస భర్తకు కోర్టు శిక్ష విధించింది.

Update: 2024-05-24 10:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:తన భార్య గర్భంలో పెరుగుతున్నది ఆడ బిడ్డో, మగ బిడ్డో తెలుసుకునేందుకు కొడవలితో భార్య పొట్టను చీల్చిన ఓ రాక్షస భర్తకు కోర్టు జీవిత ఖైదు విధించింది. యూపీలో జరిగిన ఈ దారుణ ఘటనలో భర్త రాక్షస చర్యకు పట్ల బుదౌన్‌ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి సౌరభ్ సక్సేనా యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. 2020 సెప్టెంబర్‌లో చోటు చేసుకున్న ఈ ఘోరం అప్పట్లో పెను సంచలనం అయింది. బదౌన్ సివిల్ లైన్స్‌లో నివాసం ఉంటున్న పన్నా లాల్, అనిత దంపతులకు ఘటన జరిగే సమయానికి వివాహం జరిగి 22 ఏళ్లు అయింది. వారికి అప్పటికే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. మరోసారి గర్భం దాల్చిన తన భార్యతో మగ శిశువు కోసం పన్ను లాల్ తరచూ గొడవ పడేవాడు. మగబిడ్డను కనకుంటే విడాకులు ఇచ్చి మరో మహిళను వివాహం చేసుకుంటానని బెదిరిచేవాడు.

ఈ క్రమంలో ఓ రోజు ఎనిమిది నెలల గర్భంతో ఉన్న తన భార్యతో పుట్టబోయే బిడ్డ లింగం విషయంలో మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన పన్నా లాల్ తన భార్య పొట్టలో ఉన్నది మగ బిడ్డనా లేక ఆడ బిడ్డనా అనేది తెలుసుకునేందుకు కొడవలి తీసుకుని తన భార్య గర్భాన్ని చీల్చాడు. ఈ క్రమంలో ఈ ఘటనలో కొడవలి కడుపు లోపలి వరకు కోసుకుపోవడంతో ఆమె పేగులు బయట పడ్డాయి. ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకున్న అనితను స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనలో అనిత ప్రాణాలతో బయటపడినా బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయారు వైద్యులు. అయితే అనిత కడుపులో మగ బిడ్డ ఉన్నట్లు వైద్యులు తేల్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా తన సోదరులతో ఆస్తి తగాద కారణంగానే తన భార్యనే నాపై దాడి చేసి గాయపరిచి తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని పన్నాలాల్ కోర్టులో వాదించాడు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు పన్నాలాల్ రాక్షసత్వాన్ని నిర్ధారించుకుని అతడికి జీవిత ఖైదు విధించింది.

కాగా అనిత సోదరుడు రవి సిగ్ మాట్లాడుతూ.. ఇదంతా ఓ పూజారి చెప్పడం వల్లే జరిగిందని ఆరోపించారు. పన్నాలాల్ కు మగ బిడ్డ కావాలని ఉండేదని అయితే తన సోదరి ఆరవ సారి గర్భం దాల్చినప్పుడు అనిత మరోసారి అమ్మాయిని కనబోతున్నదని ఒక గ్రామ పూజారి చెప్పడం వల్లే పన్నా ఆమెను అబార్షన్ కోసం చాలా ప్రయత్నించాడని చెప్పాడు. అందుకు నా సోదరి ఒప్పుకోలేదని దాంతో అనితను పన్నా నిత్యం కొట్టి హింసించేవాడని, కానీ ఇంత తీవ్రమైన చర్య తీసుకుంటాడని మేము ఊహించలేదన్నాడు. పన్నాకు కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల సంతోషిస్తున్నామని పన్నా చర్య వల్ల తన సోదరి ఇంకా సాధారణ జీవితాన్ని గడపలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News