లోక్‌సభ ఎన్నికల్లో ఆకట్టుకుంటున్న మోడీ డూప్లికేట్‌లు

ప్రధాని మోడీతో పాటు మరో ఇద్దరు మోడీలు కూడా ఈసారి ఎన్నికల్లో అందరినీ ఆకర్షిస్తున్నారు.

Update: 2024-05-22 13:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రచారం కోసం రోజుకొక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కొన్నిసార్లు ఒకేరోజు పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ మూడోసారి ప్రధాని అయ్యేందుకు కష్టపడుతున్నారు. జూన్ 1తో ముగియనున్న ఎన్నికల్లో గెలిస్తే ప్రధాని మోడీ, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా సేవలందించిన రెండో వ్యక్తిగా చరిత్రలో నిలవనున్నారు. అందుకే దేశంలోని మిగిలిన నేతల కంటే 73 ఏళ్ల నరేంద్ర మోడీ అత్యంత చురుకుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, ప్రధాని మోడీ తన ప్రచారం, ప్రసంగాలతో ఎలాగైతే వార్తల్లో నిలుస్తున్నారో ఆయనతో పాటు మరో ఇద్దరు మోడీలు కూడా ఈసారి ఎన్నికల్లో అందరినీ ఆకర్షిస్తున్నారు. ప్రపంచంలో ఒకేరకం మనుషుల్లా కనిపించే వారు ఏడుగురు ఉంటారని చాలా సార్లు వినే ఉంటాం.

అలాంటిదే..ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మోడీ లాంటి మరో ఇద్దరు మోడీలు ఎక్కువమందిని ఆకట్టుకుంటున్నారు. వారిలో ఎలక్ట్రిక్-రిక్షా డ్రైవర్ అయిన రషీద్ అహ్మద్ ఒకరు. ఢిల్లీలో నివశిస్తున్న అహ్మద్‌ను స్థానికులందరూ 'మా మోడీ' అని పిలుచుకుంటారు. 'నేను మొదటినుంచి ఇలాగే ఉన్నాను. కానీ, నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి నా గురించి చర్చ పెరిగింది. ఆయనలాగే పోలికలు ఉండటం, తెల్ల జుట్టు, గడ్డం, మోడీ తరహాలో దుస్తులు ధరించడం వల్ల నేను ఎక్కువ ఫేమస్ అయ్యానని ' రషీద్ అహ్మద్ చెప్పారు. కేవలం రెండు గదుల ఇంట్లో భార్య పిల్లలు, మనవరాళ్లతో నివశిస్తున్న అహ్మద్, చుట్టుపక్కల మాత్రం అతన్ని కలిసేందుకు, అతనితో ఫోటోలు దింగేందుకు చాలామంది వస్తుంటారు. దానివల్ల కొన్నిసార్లు తన రోజువారీ పనులకు అంతరాయం కూడా కలుగుతుందని అహ్మద్ చెబుతున్నారు. రిక్షా డ్రైవర్ కావడంతో అహ్మద్ స్థానికంగా చాలామంది పిల్లలు అతని రిక్షాలోనే స్కూళ్లకు వెళ్తారు. వారంతా అహ్మద్‌ను 'మోడీ అంకుల్' అనే పిలుస్తారు.

ఎన్నికల నేపథ్యంలో రషీద్ అహ్మద్ బీజేపీకి చెందిన ర్యాలీలకు కూడా మోడీ డూప్లికేట్‌గా హాజరవుతుంటాడు. మొదట్లో తనను నిజంగా మోడీ అనే చాలామంది అనుకున్నారు. అలా పలుమార్లు సభలు, ర్యాలీలకు వెళ్లాను. దానివల్ల కొంతమంది తనను, తన మోడీ రుపాన్ని చూసి రూ. వెయ్యి వరకు ఇచ్చేవారు. తాను రోజంతా రిక్షా నడిపినా వెయ్యే వస్తుంది. కానీ, కేవలం నేను మోడీలా ఉన్నందుకు, కొంతమంది అభిమానంతో ఇస్తారు. అందుకు కాదనలేం. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ల కోసమే రోజువారి వృత్తిని పక్కనపెట్టి సభలు, ర్యాలీలకు పాల్గొంటాం కాబట్టి అని రషీద్ అహ్మద్ అన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ముస్లింలకు అనుకూల పార్టీ అని కాంగ్రెస్‌ను ప్రధాని మోడీ తరచుగా విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన అహ్మద్.. అది ప్రధానమంత్రి వ్యాఖ్యలు కావు, పార్టీలో దిగువ స్థాయికి చెందినవారు మతం పేరుతో విభజనను ప్రోత్సహిస్తారని వివరించారు.

ఇక, ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో మోడీలాంటి వ్యక్తి జగదీష్ భాటియా. ఈయన కూడా ఢిల్లీలోనే ఉంటారు. రాజధానిలోని సంపన్న ప్రాంతాల్లో జగదీష్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ ర్యాలీలకు హాజరయ్యేందుకు తాను డబ్బు తీసుకోనని, ఎందుకంటే ప్రధాని మోడీకి దేశం పట్ల దార్శనికత నచ్చినందున, దాన్ని సామాజిక సేవగా భావిస్తానని జగదీష్ చెప్పారు. ప్రధాని మోడీ చేసే పని, దేశాభివృద్ధికి ఆయన చేసిన పనులు తనకు బాగా నచ్చాయన్నారు. ఈ ఎన్నికల ఫలితాల గురించి జగదీష్‌ను అడిగినప్పుడు.. దీనికి కాలమే సమాధానం చెబుతుంది. మంచి జరగాలని, అభివృద్ధి వైపు దేశం నడవాలని కోరుకుంటానని జగదీష్ భాటియా పేర్కొన్నారు. 

Tags:    

Similar News