బీజేపీ డబ్బుతో ఓట్లను కొంటోంది : మమతా బెనర్జీ

బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీ డబ్బుతో ఓట్లను కొంటోందని ఆరోపించారు.

Update: 2024-05-08 14:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీ డబ్బుతో ఓట్లను కొంటోందని ఆరోపించారు. బెంగాల్ లోని ఆరంబాగ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో దీదీ ప్రసంగించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మితాలీ బాగ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఆ ర్యాలీలోనే బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలకు రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు చెల్లించి.. కాషాయ పార్టీ ఓట్లను కొనుగోలు చేస్తుందని ఆరోపించారు.

ఘోరమైన పాలన వద్దనుకుంటే.. బీజేపీకి ఓటు వేయడం మానుకోవాలని సూచించారు. బెంగాల్ ప్రజల పరువు తీయడం బీజేపీ అలవాటని మండిపడ్డారు. సందేశ్ ఖాలీలోని మహిళలకు డబ్బు చెల్లించి అసత్య ఆరోపణలు చేయించారని మండిపడ్డారు. 26వేల టీచర్ ఉద్యోగాలను బీజేపీ లాక్కొందని.. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో నిజం గెలిచిందన్నారు. తాను నిజం కోసం పోరాడుతున్నానని అన్నారు. ప్రధాని మోడీ ఎప్పుడూ అబద్ధాలు చెప్తూనే ఉంటారని ఎద్దేవా చేశారు.

సీఏఏ, ఎన్ఆర్సీల ద్వారా బీజేపీ ప్రజలను తరిమికొడుతోందని అన్నారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే మైనారిటీలు, ఆదివాసీలు, ఓబీసీలు అస్థిత్వం కోసం పోరాడాల్సి వస్తుందన్నారు. ఉపాధి హామీ పనుల గురించి మోడీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు దీదీ. బెంగాల్ ప్రభుత్వం రూ.24 కోట్లు ఆదే చేసిందన్నారు. ఈసారి మోడీ గెలిస్తే అన్నీ పోతాయని అన్నారు. అలాగే భవిష్యత్ లో ఎన్నికలు కూడా ఉండవని చెప్పుకొచ్చారు.

Similar News