నిందితుడితో కలిసి కేజ్రీవాల్ సిగ్గు లేకుండా తిరుగుతున్నారు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విరుచుకుపడ్డారు.

Update: 2024-05-17 08:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విరుచుకుపడ్డారు. శుక్రవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాటి ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంపై మాట్లాడాల్సిన ఆయన, అలా చేయకుండా ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న బిభవ్ కుమార్‌తో కలిసి "సిగ్గు లేకుండా" తిరుగుతున్నారని ఆమె అన్నారు. ఈ అంశంపై ఆప్ కన్వీనర్ క్షమాపణ చెప్పాలని సీతారామన్ డిమాండ్ చేశారు.

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మలివాల్ కేసులో చర్య తీసుకుంటామని హామీ ఇచ్చిన ఒక రోజు తర్వాత, నిందితుడితో కలిసి లక్నోలో కేజ్రీవాల్‌తో కనిపించడంపై ఆమె విమర్శలు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా పనిచేసిన స్వాతి మలివాల్‌పై ఇలా ప్రవర్తించడం దారుణం అని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది తనపై దాడి చేశారని మలివాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బిభవ్ కుమార్‌ను నిందితుడిగా పేర్కొన్నారు.

ఈ ఘటనపై విచారణ చేయడానికి ఢిల్లీ పోలీసులు గురువారం మలివాల్ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సీఎం నివాసంలో బిభవ్ కుమార్‌ తనపై 7-8 సార్లు చెంపపై కొట్టాడని, కాలితో చాతీ, కడుపుపై తన్నాడని, తనపై విచాక్షణరహితంగా భౌతిక దాడికి దిగాడని స్వాతి మలివాల్ పేర్కొందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. గురువారం రాత్రి మలివాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలు అయినట్లు తేలిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు.

Similar News