మోడీ వర్సెస్ నవీన్ పట్నాయక్‌.. రేపు ఒడిశాలో 6 లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌

ప్రధాని నరేంద్ర మోడీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ల ప్రజాదరణకు కఠిన పరీక్ష కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Update: 2024-05-24 13:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా రాష్ట్రంలో రేపు ఆరు లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాలకు మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తూర్పు రాష్ట్రంలో జరిగే పోలింగ్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ల ప్రజాదరణకు కఠిన పరీక్ష కానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ నాలుగు లోక్‌సభ, 34 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 3 లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 2 సీట్లకు పరిమితమైంది. ఒడిశా రాష్ట్రంలో మూడో దశ పోలింగ్ ప్రచారంలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో సహా డజను మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. గడిచిన రెండు దశాబ్దాల నుంచి అధికారిక బిజూ జనతాదళ్‌కు కంచుకోటగా ఉన్న ఒడిశాలో ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు నవీన్ పట్నాయక్, ఆయన విశ్వసనీయ అధికారి, రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వీకే పాండియన్ నేతృత్వంలోని పార్టీ అధికార బీజేడీ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రకటించిన ఉచితాలు, 90 శాతం మంది ఉచిత విద్యుత్ వంటి ప్రకటనలు ఈసారి ఎన్నికలకు కీలకం కానున్నాయి.

రాష్ట్రంలో మొత్తం 94.41 లక్షల మంది ఓటర్లు 64 మంది లోక్‌సభ అభ్యర్థులు, 383 అసెంబ్లీ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మొత్తం 40.30 లక్షల పురుష ఓటర్లు, 39.31 లక్షల మంది మహిళా ఓటర్లు, 850 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆరుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మహతాబ్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సంబిత్ పాత్ర, బీజేపీ సిట్టింగ్ భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి వంటి కీలక అభ్యర్థులతో నిండిన ఆరు కీలక లోక్‌సభ స్థానాల్లో అధికార బీజేడీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య గట్టి పోరు జరగనుంది.

ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) నికుంజ కుమార్ ధాల్ ప్రకారం, 10,551 బూత్‌లలో పోలింగ్ జరుగుతుంది. వీటిలో 2,000 పోలింగ్ స్టేషన్‌లను మోడల్ బూత్‌లుగా, 1,500 బూత్‌లను ప్రత్యేకంగా మహిళా సిబ్బంది నిర్వహిస్తారు. మొత్తం బూత్‌లలో 60 శాతం వెబ్‌కాస్టింగ్ జరిగిందని, ఈ దశ ఎన్నికలలో అత్యధిక సంఖ్యలో 121 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)ని మోహరించినట్లు నికుంజ కుమార్ చెప్పారు. గత రెండు దశల ఎన్నికల్లో మే 13, మే 20 తేదీల్లో 11 నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల్లో తొలిసారిగా ఎలాంటి హింసాకాండ లేకుండా ప్రశాంతంగా పోలింగ్‌ జరిగిందని ఆయన పేర్కొన్నారు. 

Tags:    

Similar News