బీహార్ లోక్ సభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. కొడుకు పై తల్లి నామినేషన్!

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల జోరు కొనసాగుతోంగా.. బీహార్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-05-16 09:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల జోరు కొనసాగుతోంగా.. బీహార్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బోజ్ పురి సూపర్ స్టార్ కు పోటీగా ఆయన తల్లి నామినేషన్ వేసింది. బీహార్ లోక్ సభ ఎన్నికల్లో బోజ్ పురి స్టార్ హీరో పవన్ సింగ్ కరాకట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ వేసిన పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆయన నామినేషన్ వేసిన కరాకట్ పార్లమెంట్ నియోజకవర్గం నుండే ఆయన తల్లి ప్రతిమా దేవి కూడా నామినేషన్ వేయడం గమనార్హం. కొడకు పోటీ చేస్తున్న అదే స్థానం నుంచి తల్లి కూడా నామినేషన్ వేయడం బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక కరాకట్ పార్లమెంట్ నియోజవర్గం నుంచి రాష్ట్రీయ లోక్‌మోర్చా సారథ్యంలోని మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి ఉండగా.. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘటబంధన్ సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి రాజారామ్ సింగ్‌ను పోటీకి దింపింది. అయితే తన కుమారుడు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉండటంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారా? లేదా ఏకంగా కొడుకుతో ఢీకొనేందుకే ఆమె పోటీ చేస్తున్నారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కాగా పవన్ సింగ్ ను బీజేపీ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ స్థానం నుంచి బరిలో ఉంచాలని చూసినా.. ఆయన తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించి, బీజేపీ ఆఫర్ ను తిరస్కరించారు. ఈ మేరకు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ వేశారు.

Similar News