ఇంటర్నెట్‌ షట్‌డౌన్ ఘటనలు భారత్‌లోనే అత్యధికం

ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లో భారత్‌ మొదటి స్థానంలో నిలవటం వరుసగా ఇది ఆరో సంవత్సరం

Update: 2024-05-15 13:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తరుచుగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయటంలో భారత్ ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలతో 283 సార్లు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయగా, అందులో 116 ఘటనలు మన దేశంలోనే చోటుచేసుకొన్నాయని డిజిటల్‌ హక్కుల సంస్థ యాక్సెస్‌ నౌ తెలిపింది. ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లో భారత్‌ మొదటి స్థానంలో నిలవటం వరుసగా ఇది ఆరో సంవత్సరం. ఇంటర్‌నెట్ షట్‌డౌన్ కారణంగా భారత ఆర్థికవ్యవస్థపై ప్రభావం ఉంటుందని యాక్సెస్ నౌ అభిప్రాయపడింది. గతేడాది 116 సార్లు షట్‌డౌన్ చేయడం వల్ల భారత్‌కు 1.9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 16 వేల కోట్లు) నష్టం వాటిల్లింది. దేశంలో 64 షట్‌డౌన్ ఘటనల కారణంగా ఒకటి కంటే ఎక్కువ జిల్లాలు ప్రభావితం అయ్యాయి. మణిపూర్‌లో అత్యధికంగా 47 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ జరగ్గా, గతేడాది మే 3 నుంచి డిసెంబర్ 3 వరకు 212 రోజుల పాటు మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు స్థానిక లేదా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్‌డౌంట్ ఘటనలను చూశాయి. 41 శాతం షట్‌డౌన్‌లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజుకు ఉన్నాయి. ఇది 2022లో 15 శాతం మాత్రమే ఉంది. 

Tags:    

Similar News