మిస్ యూనివర్స్ పోటీలకు 60 ఏళ్ల వృద్ధురాలు..!

అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోస్ అనే మహిళ రికార్డు సృష్టించింది. ఈ 60 ఏళ్ల మహిళ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధం అవుతోంది.

Update: 2024-04-27 13:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోస్ అనే మహిళ రికార్డు సృష్టించింది. ఈ 60 ఏళ్ల మహిళ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధం అవుతోంది. టీనేజీ యువతులతో పోటీ పడి.. యూనివర్స్‌ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు. అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఇటీవల అందాల పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో లా ప్లాటా నగరానికి చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌ టైటిల్‌ను గెలుచుకుని రికార్డు సృష్టించారు. దీంతో అందాల పోటీల్లో అత్యంత పెద్ద వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా అలెజాండ్రా రికార్డు నెలకొల్పారు.

లాయర్, జర్నలిస్ట్ అయిన అలెజాండ్రా.. అందాల పోటీలకు వయసు అడ్డు కాదని నిరూపించారు. అంతేకాకుండా ఈ ఏడాది మే నెలలో జరగనున్న ‘మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా’ పోటీల్లో.. అలెజాండ్రా బ్యూనస్‌ ఎయిర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక ఆ పోటీల్లో గెలిస్తే సెప్టెంబరులో మెక్సికో వేదికగా జరిగే మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో అర్జెంటీనా తరఫున అలెజాండ్రా పాల్గొననున్నారు. మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెలుచుకోవడంతో అలెజాండ్రా ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మిస్ యూనివర్స్ పోటీల్లో గతంలో కేవలం 18 నుంచి 28 ఏళ్ల వయసు వారికే ఛాన్స్ ఉండేది. కానీ గతేడాది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయాన్ని మార్చివేసింది. అందాల పోటీలో పాల్గొనే వారికి ఏజ్ లిమిట్ తొలగించింది. 18 ఏళ్లు దాటిన యువతులు, మహిళలు, వృద్ధులు ఎవరైనా సరే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే ఇటీవల డొమినికన్‌ రిపబ్లికన్‌కు చెందిన 47 ఏళ్ల హైదీ క్రూజ్‌.. ఆ దేశ అందాల కిరీటం గెల్చుకున్నారు. ఇక ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో డొమినికన్‌ రిపబ్లికన్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

Similar News