ఓటేస్తే డైమండ్ రింగ్, ల్యాప్ టాప్ గెలుచుకునే అవకాశం.. ఎక్కడంటే?

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు గాను రెండు దశల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మే 7వ తేదీన మూడో దశ పోలింగ్ జరగనుంది.

Update: 2024-04-30 06:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు గాను రెండు దశల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మే 7వ తేదీన మూడో దశ పోలింగ్ జరగనుంది. అయితే రెండు విడతల్లో జరిగిన పోలింగ్‌లో మధ్యప్రదేశ్‌లో గతంలో కంటే 8.5శాతం తక్కువగా ఓటింగ్ నమోదైంది. దీంతో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఓటేసిన ప్రజలకు లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగులు, ల్యాప్ టాప్ లు, స్కూటర్లు, బైక్‌లు, ప్రిజ్‌లు అందజేయనున్నట్టు తెలిపారు.

దీనికి గాను భోపాల్‌లోని పలు మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఇతర ప్రదేశాల్లో కూపన్ బాక్సులను ఏర్పాటు చేసినట్టు భోపాల్ జిల్లా పంచాయతీ సీఈఓ రితురాజ్ సింగ్ వెల్లడించారు. బంపర్ బహుమతులతో పాటు సుమారు 6000కు పైగా ఇతర గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఓటర్లు తమ మొబైల్ నంబర్లు, పేర్లు, ఓటర్ ఐడీతో కూడిన ఫామ్‌లను పూర్తి చేసి అధికారులు ఏర్పాటు చేసిన కూపన్ బాక్సులో వేయాలి. ఎన్నికల అనంతరం డ్రా తీసి గెలిచిన వారికి బహుమతులు అందించనున్నారు. డ్రాలో విజేతగా నిలిచిన వారు వేలిపై చెరగని సిరాను చూపించాల్సి ఉంటుంది.

ప్రతి పోలింగ్ బూత్ వద్ద మూడు లక్కీ డ్రాలను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఓటర్లలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి కైశలేంద్ర చెప్పారు. జిల్లా పరిపాలన, మధ్యప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్‌తో అనుబంధంగా ఉన్న 92 వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితంగా సినిమా టికెట్లను కూడా అందజేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, భోపాల్ నియోజకవర్గంలో మొత్తం 2,097 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. 

Tags:    

Similar News