హిమాచల్ ప్రదేశ్‌లో ఆ ఇద్దరు గెలిస్తే చరిత్రే..ఎందుకంటే?

దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏడు దశలకు గాను ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తైంది. అయితే అందరి దృష్టి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పై పడింది.

Update: 2024-05-08 10:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏడు దశలకు గాను ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తైంది. అయితే అందరి దృష్టి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పై పడింది. ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచి 72ఏళ్లలో కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వారిలో మాజీ కేంద్రమంత్రి రాజకుమారి అమృత్ కౌర్, చంద్రేష్ కుమారి, ప్రతిభా సింగ్‌లు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరు మహిళలు పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున మండి నియోజకవర్గం నుంచి నటి కంగనా రనౌత్‌ బరిలో ఉండగా, కాంగ్రా నుంచి బీఎస్పీ టికెట్ పై రేఖా రాణి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో వీరు విజయం సాధిస్తే నాలుగో, ఐదో మహిళగా చరిత్రలో నిలవనున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి గెలుపు ఓటములపై ఉత్కంఠ నెలకొంది.

49శాతం మహిళలు ఉన్న ఈ రాష్ట్రంలో వారి ప్రాతినిధ్యం మాత్రం తక్కువగా ఉంది. అంటే నాలుగో వంతు కూడా ప్రాతినిధ్యం లేకపోవడంతో తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పలువురు మేథావులు అభిప్రాయపడుతున్నారు. మహిళలకు అధికారం దక్కే వరకు వారికి ప్రాముఖ్యత లభించదని భావిస్తున్నారు. అయితే మహిళలు పోటీ చేసేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కపుర్తలా రాజకుటుంబానికి చెందిన భారతదేశపు మొదటి ఆరోగ్య మంత్రి అమృత్ కౌర్, 1952లో మండి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984 వరకు ఏ మహిళకూ టికెట్ దక్కలేదు. అనంతరం 1984లో జోధ్‌పూర్ రాజకుటుంబానికి చెందిన చంద్రేష్ కుమారిని కాంగ్రా నుంచి కాంగ్రెస్ పోటీకి నిలబెట్టగా ఆమె విజయం సాధించింది.

అలాగే మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ 1998 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. అయితే 2004లో తన భర్త సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. 2013, 2021 ఉపఎన్నికల్లో ఆమె మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వీరు మినహా ఇప్పటి వరకు మహిళా అభ్యర్థులెవరూ పార్లమెంటు గడప తొక్కలేదు. అంతేగాక 68 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలోనూ మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది.1967 వరకు ఏ మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. 1977, 2022లో ఒక్క మహిళ మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టారు.1998 ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీకి అత్యధికంగా ఏడుగురు మహిళలు ఎన్నికయ్యారు. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ఎనిమిది మంది మహిళలు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కాగా, రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.

Tags:    

Similar News