ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు.. ఈసారి ఏకంగా హోం మంత్రిత్వ శాఖకు మెయిల్

నార్త్ బ్లాక్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ మెయిల్ రావడంతో భద్రతా బలగాలు తక్షణం రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి.

Update: 2024-05-22 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల వరసగా దేశంలోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని దాదాపు 150 స్కూళ్లకు ఇలాగే బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో మరోసారి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది. తాజాగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు నార్త్ బ్లాక్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ మెయిల్ పంపడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు తక్షణం రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. నార్త్ బ్లాక్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లోని ఒక సీనియర్ అధికారికి ఈ-మెయిల్ బెదిరింపు రావడంతో ఆయన ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. అనంతరం అగ్నిమాపక సిబ్బందితో పాటు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సమీప ప్రాంతాల్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టిన అనంతరం ఏం లేదని తేల్చారు. ఎటువంటి అనుమానిత వస్తువులను గుర్తించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇటీవల 150 స్కూళ్లకు సైతం ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. దానిపై దర్యాప్తు జరిపిన పోలీసులు హంగేరీ రాజధాని బుడాపేస్ట్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని ఏడు పాఠశాలలకు కూడా ఇదే తరహా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇలాంటి బెదిరింపులు ఢిల్లీ విమానాశ్రయాన్ని, నగరంలోని ప్రధాన ఆసుపత్రులతో సహా అనేక ఇతర ప్రముఖ స్థలాలకు కూడా వచ్చాయి.  

Tags:    

Similar News