ఎన్నికలకు ముందు 25 వేల పెన్‌డ్రైవ్‌లు పంచారు: కుమారస్వామి

సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటకలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు రాగా, ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-07 13:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటకలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు రాగా, ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మహిళను కిడ్నాప్ చేసిన ఆరోపణల క్రింద ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి దీనిపై స్పందించారు. ఎన్నికలకు ముందు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించిన వీడియోలతో కూడిన 25,000 పెన్ డ్రైవ్‌లను పంపిణీ చేశారని, దీని వెనుక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తం ఉందని కుమారస్వామి ఆరోపించారు.

బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఏప్రిల్ 21 ఈ ఘటన జరిగింది. వాట్సాప్ చానెల్‌ని క్రియేట్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతర వీడియోలను చూడటానికి ఆ చానెల్‌ను ఫాలో అవ్వమని మెసేజ్‌లు పెట్టారు. దీనిపై మా పోలింగ్ ఏజెంట్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. వీడియోలను షేర్ చేసినందుకు నలుగురు వ్యక్తులపై కేసులు నమోదై 15 రోజులు అయిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమారస్వామి అన్నారు.

ఈ కేసు గురించి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)పై మొదట్లో నమ్మకం ఉండగా, ఇప్పుడు అది లేదు. సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం కాదని, "సిద్దరామయ్య ఇన్వెస్టిగేషన్ టీమ్" అండ్ "శివకుమార్ ఇన్వెస్టిగేషన్ టీమ్" అని కుమారస్వామి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ముగ్గురు జేడీ(ఎస్) అభ్యర్థులు ఓడిపోతారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది ఒక కుట్రగా అనిపిస్తుందని ఆయన అన్నారు.

Similar News