మనవడికి మాజీ ప్రధాని వార్నింగ్.. తిరిగి వచ్చి లొంగిపో.. లేదంటే..

జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవెగౌడ తన మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు వార్నింగ్ ఇచ్చారు

Update: 2024-05-23 12:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవెగౌడ తన మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు వార్నింగ్ ఇచ్చారు. విదేశాల్లో ఉన్న అతను ఇండియాకు తిరిగి రావాలని, పోలీసులకు లొంగిపోవాలని అన్నారు, లేదంటే తన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని దేవెగౌడ గురువారం అల్టిమేటం జారీ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రాగా దేశం నుంచి పారిపోయారు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా తన మనవడిపై వచ్చిన ఆరోపణలపై మౌనంగా ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ గురువారం ఎక్స్‌లో స్పందిస్తూ, రేవణ్ణ ఎక్కడ ఉన్నా వెంటనే తిరిగి రావాలి, చట్టపరమైన ప్రక్రియకు లోబడి ఉండాలి, అతను నా ఓపికను పరీక్షించవద్దు, నా ఆదేశాలను పాటించకపోతే కోపానికి గురికావాల్సి వస్తుందని ఎక్స్‌లో అన్నారు.

ప్రజ్వల్ రేవణ్ణకు 'కఠినమైన శిక్షలు' విధించాలని తాను అభిప్రాయపడ్డానని, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఈ విషయంలో తన వైఖరిని సమర్థించారని దేవెగౌడ చెప్పారు. ప్రజ్వల్ రేవణ్ణ మీద లైంగక ఆరోపణలు వచ్చినప్పటి నుంచి చాలా మంది నన్ను, నా కుటుంబానికి వ్యతిరేకంగా కఠినమైన మాటలు అన్నారు. అయితే నేను అలా తిట్టేవారిని ఆపాలని అనుకోను, అలాగే వారిని తిరిగి విమర్శించాలనుకోను, వాస్తవాలు తెలిసే వరకు వేచి ఉండాల్సిందిగా నేను వారితో వాదించను అని దేవెగౌడ పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణలు నాకు, నా కుటుంబానికి, నా సహచరులకు, స్నేహితులకు, పార్టీ కార్యకర్తలకు షాక్ కలిగించింది. దాని నుంచి నుంచి బయటపడటానికి, కోలుకోవడానికి నాకు కొంత సమయం పట్టిందని దేవెగౌడ అన్నారు.

Similar News