మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ.. పబ్లిక్ డిబేట్‌‌లో పాల్గొనాలంటూ దిగ్గజ నేతలకు ఆహ్వానం

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ ‘పబ్లిక్ డిబేట్’ నిర్వహించే ట్రెండ్ అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఉంది.

Update: 2024-05-09 14:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ ‘పబ్లిక్ డిబేట్’ నిర్వహించే ట్రెండ్ అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఉంది. ఈ దిశగా మన దేశంలోనూ త్వరలో ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీలతో పబ్లిక్ డిబేట్ నిర్వహించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ బి లోకూర్‌, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ కలిసి ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీలకు ఓ లేఖ రాశారు. వారిద్దరూ అంగీకరిస్తే తటస్థ వేదికలో పబ్లిక్ డిబేట్ నిర్వహించేందుకు సిద్ధమని వారు వెల్లడించారు. తప్పకుండా తాము నిర్వహించే పబ్లిక్ డిబేట్‌కు హాజరై మనదేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఒకవేళ వారు నేరుగా హాజరుకాలేని పరిస్థితి ఉంటే.. ఎవరైనా ప్రతినిధులను కూడా చర్చా వేదికకు పంపొచ్చని సూచించారు.

కీలక, సున్నిత అంశాలపై చర్చ అవసరం

ఇద్దరు మాజీ న్యాయమూర్తులు, ఓ సీనియర్‌ జర్నలిస్టు కలిసి మోడీ, రాహుల్‌లకు రాసిన ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ‘‘బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రజలు వాటిని విని సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అయితే ఈ ఆరోపణలు, సవాళ్లపై అధికార బీజేపీ తరఫున ప్రధాని మోడీ, విపక్ష కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ప్రజల ఎదుట హేతుబద్ధమైన వాదన వినిపిస్తే బాగుంటుంది. అందుకోసమే మేం పబ్లిక్ డిబేట్ నిర్వహించేందుకు ముందుకొచ్చాం’’ అని వారు పేర్కొన్నారు. ‘‘ఎన్నికల ప్రసంగాల్లో రాజ్యాంగం, రిజర్వేషన్లు, ఆర్టికల్ 370, సంపద పంపిణీ వంటి అంశాలను నేతలు ప్రస్తావిస్తున్నారు. ఈ తరుణంలో వాటిపై బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉంది’’ అని లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల వేళ ప్రస్తావనకు వస్తున్న కీలక, సున్నిత అంశాలపై ప్రజలకు అవగాహన పెరిగేందుకు ఈ పబ్లిక్ డిబేట్ వేదికగా నిలుస్తుందని లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News