బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ అరవిందర్‌ సింగ్‌ లవ్లీ

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి రాజీనామా చేసిన అరవిందర్‌ సింగ్‌ లవ్లీ శనివారం బీజేపీలో చేరారు

Update: 2024-05-04 11:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి రాజీనామా చేసిన అరవిందర్‌ సింగ్‌ లవ్లీ శనివారం బీజేపీలో చేరారు. లోక్‌సభ సీట్ల విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉండటంతో పాటు, ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తపెట్టుకోవడం కూడా ఆయనకు ఇష్టం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో, అవినీతి కేసులకు సంబంధించి ఆప్ నేతలు చాలా మంది జైల్లో ఉన్నారు. అలాంటి వారితో పొత్తు పెట్టుకోవడం ఏంటని అన్నారు. దీనిని నిరసిస్తూ తాను పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో అరవిందర్‌ సింగ్‌ లవ్లీ బీజేపీలో చేరారు. ఆయనతో పాటు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీరజ్ బసోయా, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమిత్ మల్లిక్ కూడా కాషాయ పార్టీలో జాయిన్ అయ్యారు. 2015లో కూడా అరవిందర్‌ సింగ్‌ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేశారు. 2017లో బీజేపీలో చేరారు, తిరిగి తొమ్మిది నెలల తరువాత కాంగ్రెస్‌ తీర్థం తీసుకున్నారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీలో జాయిన్ అయ్యారు.

Similar News