ఢిల్లీలో 4 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడ్డారు.

Update: 2024-05-26 05:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడ్డారు. తూర్పు ఢిల్లీలోని కృష్ణ నగర్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల నివాస భవనంలో తెల్లవారుజామున 2:30 గంటలకు అగ్నిప్రమాదం సంభవించిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌‌కు ఫోన్‌కాల్ వచ్చింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ సర్వీస్‌లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక అధికారుల ప్రకారం, మొత్తం 12 మందిని రక్షించారు, అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు ప్రకటించారు. వారిలో ఇద్దరిని అంజు శర్మ (40), కేశవ్ శర్మ (18)గా గుర్తించారు. మరో మహిళ మృతదేహం భవనం మొదటి అంతస్తులో కనుగొన్నారు. అయితే తీవ్రంగా కాలిపోవడంతో ఆమె ఎవరనేది కొద్దిసేపు తెలియరాలేదు. ఆ తరువాత ఆమెను 66 ఏళ్లు కలిగిన పర్మిలా షాద్‌గా అధికారులు గుర్తించారు. నివేదికల ప్రకారం, భవనంలోని పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అగ్నిమాపక శాఖ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ, తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగినట్టుగా ఫోన్ కాల్ రావడంతో హూటాహుటిన మా సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే మంటలు తీవ్రం కావడంతో లోపలికి వెళ్లే మార్గం మూసుకుపోయింది. అయినప్పటికి మంటలను ఆర్పుతూ దాదాపు 12 మందిని రక్షించాం. అయితే, దురదృష్టవశాత్తు, ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు, గాయాలు అయిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఉదయం 7.20 గంటలకు మంటలను ఆర్పివేశారు. రెండు, మూడు, నాల్గవ అంతస్తుల్లో వేడి, పొగ ప్రభావం విపరీతంగా ఉందని అధికారులు తెలిపారు. మంటల కారణంగా సంఘటనా స్థలంలో ఉన్న 11 వాహనాలు బూడిదయ్యాయి.

Read More..

ఢిల్లీ చిల్డ్రన్ హాస్పిటల్ అగ్నిప్రమాదంపై స్పందించిన ప్రధాని మోడీ 

Similar News