ఉగ్రవాద కుటుంబాలు, రాళ్లు రువ్వే వారికి జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగం రాదు: అమిత్ షా

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా ఉగ్రవాదాన్ని నిర్మూలించిందని, అందుకే తీవ్రవాద ఘటనలు తగ్గాయని అమిత్ షా అన్నారు.

Update: 2024-05-27 09:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో ఏ ఉగ్రవాద కుటుంబ సభ్యులకు, రాళ్లదాడి చేసిన వారి దగ్గరి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా పూర్తిగా ఉగ్రవాదాన్ని నిర్మూలించిందని, అందుకే దేశంలో తీవ్రవాద ఘటనలు చాలావరకు తగ్గాయని అమిత్ షా అన్నారు. సోమవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. కశ్మీర్‌లో ఎవరైన ఉగ్రవాద సంస్థలో చేరితే వారి కుటుంబసభ్యులకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఎవరైనా రాళ్లదాడికి పాల్పడితే, వారితో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం రాదని అమిత్ షా తెలిపారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు మానవ హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టుకు వెళ్లారని, అయినప్పటికీ ప్రభుత్వమే ఇందులో నెగ్గిందన్నారు. అయితే, ఎవరైనా కుటుంబం నుంచి ముందుకు వచ్చి సదరు వ్యక్తి బంధువు ఉగ్రవాద సంస్థలో చేరినట్టు అధికారులకు తెలియజేస్తే ప్రభుత్వం వారికి మినహాయింపునిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. అలాంటి కుటుంబాలకు అండగా ఉంటాం. ఇదివరకు ఎవరైన ఉగ్రవాది హతమైతే కశ్మీర్‌కు వెలుపల అంత్యక్రియలు నిర్వహించేవారు. మేము ఆ ధోరణిని ఆపి, హతమైన ఉగ్రవాదులను వారి మతపరమైన లాంఛనాలతో నిర్వహించేలా అనుమతిచ్చాం, అయితే ఏదైనా నిర్జన ప్రదేశంలో ఖననం చేసేందుకు వీలు కల్పించామని అమిత్ షా వెల్లడించారు. 

Tags:    

Similar News