జమ్మూ కశ్మీర్‌లో ఎన్ కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. తంగ్‌ధర్ సెక్టార్‌లోని కంచెకు అవతలివైపు మృతదేహాలు పడి ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భారత సైన్యం, కశ్మీర్ పోలీసులు ఉమ్మడి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే అమ్రోహి, తంగ్‌ధర్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టి చొరబాటు ప్రయత్నాలను విఫలం చేశారు. రెండు పిస్టల్స్, మందుగుండు సామగ్రి, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. గత నెలలోనూ ఇదే తరహా ఘటనలో బారాముల్లా జిల్లాలోని ఉరీలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని ఆర్మీ విఫలం చేయడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.