5 దశల పోలింగ్ డేటాను విడుదల చేసిన ఈసీ.. మొత్తం వివరాలు ఇవే..

లోక్‌సభ ఎన్నికల ఐదు విడతల కచ్చితమైన పోలింగ్‌ డేటాను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం విడుదల చేసింది.

Update: 2024-05-25 14:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఐదు విడతల కచ్చితమైన పోలింగ్‌ డేటాను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం విడుదల చేసింది. ఏ విడతలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు ? వారిలో ఓటు వేసింది ఎంతమంది ? పోలింగ్ శాతం ఎంత ? అనే సమాచారాన్ని రిలీజ్ చేసింది. అంతేకాదు ఐదు విడతల్లో పోలింగ్ జరిగిన ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో పోలైన ఓట్ల వివరాలను కూడా ఈ నివేదికలో ఈసీ ప్రస్తావించింది. ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని స్పష్టం చేసింది. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. పోలింగ్ శాతాల సమాచారం అభ్యర్థులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఈసీ తెలిపింది. పోలింగ్ శాతానికి సంబంధించిన వివరాలను విడుదల చేయడంలో ఎలాంటి ఆలస్యమూ జరగలేదని తేల్చి చెప్పింది.

ఎన్నికల ప్రతి విడతలోనూ పోలింగ్‌ రోజు ఉదయం 9.30 గంటల నుంచి ఎప్పటికప్పుడు ఓటింగ్‌ డేటాను ఓటర్‌ టర్నవుట్‌ యాప్‌లో అందుబాటులో ఉంచామని తెలిపింది. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు లేనిపోని అనుమానాలను కలుగజేసేందుకు కొందరు తప్పుడు కథనాలను వ్యాపింపచేస్తున్నారని ఈసీ పేర్కొంది. ఐదు విడతల్లో బూత్‌ల వారిగా పోలింగ్‌ డేటాను ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సిందిగా ఈసీని ఆదేశించాలని ఏడీఆర్‌ దాఖలు పిటిషన్‌పై శుక్రవారమే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తాము ఈ విషయంలో ఈసీకి ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది జరిగిన మరుసటి రోజే (శనివారం) ఐదు విడతల పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం గమనార్హం.

ఐదు విడతల పోలింగ్ చిట్టా..

1. మొదటి దశ పోలింగ్‌లో మొత్తం 16,63,86,344 మందికిగానూ 11,00,52,103 మంది ఓటు వేశారు. 66.14 శాతం పోలింగ్ నమోదైంది.

2. రెండో దశ పోలింగ్‌లో మొత్తం 15,86,45,484 మందికిగానూ 10,58,30,572 మంది ఓటు వేశారు. 66.71 శాతం పోలింగ్ నమోదైంది.

3. మూడో దశ పోలింగ్‌లో మొత్తం 17,24,04,907 మందికిగానూ 11,32,34,676 మంది ఓటు వేశారు. 65.68 శాతం పోలింగ్ నమోదైంది.

4. నాలుగో దశ పోలింగ్‌లో మొత్తం 17,70,75,629 మందికిగానూ 12,24,69,319 మంది ఓటు వేశారు. 69.16 శాతం పోలింగ్ నమోదైంది.

5. ఐదో దశ పోలింగ్‌లో మొత్తం 8,95,67,973 మందికిగానూ 5,57,10,618 మంది ఓటు వేశారు. 62.20 శాతం పోలింగ్ నమోదైంది.

Similar News