ఢిల్లీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దేవేందర్ యాదవ్‌ను ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు.

Update: 2024-05-05 13:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దేవేందర్ యాదవ్‌ను ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసిన అరవిందర్ సింగ్‌ లవ్లీ కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో రాజకీయ పరిణామాల మధ్య దేవేందర్ యాదవ్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఇది నాకు చాలా ముఖ్యమైన రోజు, నా మీద చాలా పెద్ద బాధ్యతను ఉంచారు. నాపై విశ్వాసం చూపినందుకు కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు, బాధ్యతలన్నింటినీ నెరవేర్చటానికి నేను అన్ని విధాల కష్టపడి పనిచేస్తానని వారికి హామీ ఇస్తున్నానని అన్నారు. కష్ట సమయాల్లో ఉన్న పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ఢిల్లీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు తెలిపారు.

ఇటీవల ఢిల్లీలో లోక‌సభ సీట్ల పంపకాలు, కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో దానిని నిరసిస్తూ ఏప్రిల్ 28న అరవిందర్‌ సింగ్‌ లవ్లీ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీరజ్ బసోయా, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమిత్ మల్లిక్ తాజాగా బీజేపీలో చేరారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఆప్ 4 స్థానాల్లో పోటీ చేస్తుంది. మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.

Similar News